కర్ణాటక మహాదేవ్పుర్లో వింత ఘటన వెలుగుచూసింది. పెళ్లైన మరుసటి రోజే ఓ నవవరుడు తన భార్యను వదిలి పారిపోయాడు. భర్త కోసం దాదాపు రెండు వారాలు వెతికినా సరే ఫలితం లేకపోవడం వల్ల బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ లవర్ బెదిరింపులు కారణంగానే ఆ నవ వరుడు పరారైనట్లు గుర్తించారు.
అసలేం జరిగిందంటే..?
బెంగళూరులోని మహదేవ్‌పుర్ ప్రాంతానికి చెందిన జార్జ్ అనే 26 ఏళ్ల యువకుడికి అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతితో.. ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. అయితే నూతన దంపతులు పెళ్లైన మరుసటి రోజు చర్చికి వెళ్లి వస్తుండగా.. రోడ్డుపై ఓ చోట ట్రాఫిక్ జామ్ అయ్యింది. అదే సరైన సమయంగా భావించిన జార్జి కారు డోర్ తీసుకుని పారిపోయాడు. దీంతో షాక్‌కు గురైన అతడి భార్య.. కారు దిగి అతడిని వెంబడించే ప్రయత్నం చేసింది. కానీ ఆమెకు దొరకకుండా తప్పించుకున్నాడు. అనంతరం ఇరువురి కుటుంబసభ్యులు దాదాపుగా రెండు వారాల పాటు జార్జ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సరే అతడి ఆచూకి తెలియలేదు. దీంతో మార్చి 5న బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్జ్ గోవాలో ఉన్న ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. జార్జ్ గోవాలో ఉన్న సమయంలో అక్కడే తన సహోద్యోగిగా ఉన్న డ్రైవర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె కూడా ప్రస్తుతం అదే కంపెనీలో క్లర్క్‌గా పనిచేసింది. ఈ సంబంధం గురించి తెలుసుకున్న జార్జ్ తల్లి అతడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. దీంతో తన ప్రేయసిని విడిచిపెట్టమని జార్జ్‌కు చెప్పింది. అయినా సరే జార్జ్ ఆమెతో సంబంధం కొనసాగించాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని జార్జ్‌కు కాబోయే వధువుకు కూడా చెప్పింది అతడి తల్లి. దీంతో జార్జ్ తన ప్రేయసితో సంబంధం కొనసాగించబోనని కాబోయే భార్యకు హామీ ఇచ్చాడు. జార్జ్‌పై ఉన్న నమ్మకంతో ఆమె ఈ వివాహానికి అంగీకరించింది. అయితే జార్జ్‌కు పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసుకున్న అతడి మాజీ ప్రేయసి.. అప్పటి నుంచి వారిద్దరూ ఏకాంతంగా గడిపిన సమయంలో తీసుకున్న వీడియోలను, ఫొటోలను బహిర్గతం చేస్తానని బెదిరించేది. ఈ విషయాన్ని జార్జ్ తన భార్యకు కూడా చెప్పాడు. ఈ విషయంలో తన తల్లిదండ్రుల నుంచి కావాల్సిన సాయం అందిస్తానని హామీ ఇచ్చింది వధువు. అయినా సరే జార్జ్ తన మాజీ ప్రేయసి బెదిరింపులకు తట్టుకోలేక పెళ్లైన మరుసటి రోజే తన భార్యను వదిలి పారిపోయాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు జార్జ్ కోసం గాలింపు చర్యలు చెపడుతున్నట్లు వెల్లడించారు.