కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ వింత ఘటన జరిగింది. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేందుకు ఓ పురుషుడు మహిళలా వేషం వేసుకుని వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించాడు. చివరకు ఓ మహిళతో జరిగిన గొడవలో అతడి నిజస్వరూపం బయటపడింది. దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు స్థానికులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చేతన్.. అనే వ్యక్తికి పెళ్లై భార్యా, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఈజీ మనీ కోసం మహిళలా వేషధారణ చేసుకొని వీధుల్లో భిక్షాటన చేసేవాడు. కేవలం విలాసంవంతమైన జీవితాన్ని గడిపేందుకే చేతన్ ఇలా మహిళా వేషధారణలో భిక్షాటన చేసేవాడని పోలీసులు తెలిపారు. చేతన్ ఇంట్లో ఉన్నప్పుడు సాధారణ పురుషుడిలానే ఉండేవాడని.. ఇంటి నుంచి బయటకు రాగానే మహిళలా వస్త్రధారణ చేసుకొని బెంగళూరులోని నాగసంద్ర మెట్రో స్టేషన్ పరిసరాల్లో భిక్షాటన చేసేవాడని పోలీసులు పేర్కొన్నారు.
ప్రత్యేక గదిలో..
ఈ విషయం తన భార్య, పిల్లలకు తెలియకుండా చాలా జాగ్రత్త పడేవాడు చేతన్. మహిళలు ధరించే దుస్తులు, నగలు ఇతర సామగ్రిని భద్రపరిచేందుకు ఏకంగా ఇంట్లో ఓ ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు చేతన్. అయితే కేవలం డబ్బు కోసమే చేతన్.. మహిళలా వేషం వేసుకుని ట్రాన్స్జెండర్లతో తిరిగేవాడని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. చేతన్ ఒకరోజు నాగసంద్ర మెట్రో స్టేషన్ సమీపంలో అక్రమంగా ఓ షెడ్డు నిర్మించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో జులై 13న బెంగళూరు మెట్రో రైలు అధికారులు ఇదే ప్రాంతంలో భూ తనిఖీలు చేపట్టారు. అలా అధికారులు స్థానికులు సాయంతో తనిఖీలు చేస్తున్న సమయంలో అక్కడే షెడ్డు నిర్మించాలని భావించిన చేతన్ ఓ స్థానిక మహిళతో వాగ్వాదానికి దిగి అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు చేతన్‌ను కొట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో అతడు నిజమైన మహిళ కాదని.. పురుషుడే ఇలా మహిళలా వేషం వేసుకొని తిరుగుతున్నాడన్న విషయం బయటపడింది. దీంతో వెంటనే బాగల్‌గుంటె పోలీసులకు సమాచారం ఇచ్చారు అధికారులు, స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చేతన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఫ్రీ బస్సు ప్రయాణం కోసం..
కర్ణాటకలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ఓ పురుషుడు వింతగా ఆలోచించాడు. తాను మహిళనని నమ్మించేందుకు ఓ నకిలీ ఆధార్ కార్డ్ సైతం సృష్టించాడు. అనంతరం రోజూ ముస్లిం మహిళలా 'బుర్ఖా' వేసుకొని బస్సులో ప్రయాణించాడు. ఈ క్రమంలో అతడిపై అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు అతడు వేసుకున్న బుర్ఖాను తొలగించి చూడగా పురుషుడు అని బయటపడింది. చివరకు అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ పూర్తి వార్త కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.