ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ వ్యక్తి.. ఇరవై సంవత్సరాల తరువాత తిరిగివచ్చాడు. అప్పట్లో అనూహ్య పరిణామాల నడుమ వివిధ ప్రాంతాలు తిరుగుతూ జమ్ముకశ్మీర్‌కు చేరుకున్న అతనికి.. తిరిగి వచ్చే దారి తెలియదు. రాష్ట్రం కాని రాష్ట్రంలో అనేక కష్టాలు పడిన ఆ వ్యక్తి చివరకు సైనికుల సహాయంతో ఇంటికి చేరగలిగాడు.
కూలీ పని కోసం వెళ్లి..
కర్ణాటక ధార్వాడ్ జిల్లా గాంధీనగర్‌కు చెందిన కెంచప్ప గోవిందప్ప రెండు దశాబ్దాల క్రితం కూలీ పని కోసమని రైల్లో బయలుదేరి వెళ్లాడు. టికెట్ లేకుండా రైలెక్కిన అతడిని హరిద్వార్‌లో దింపేశారు అధికారులు. కొద్దిసేపు అక్కడే వేచిఉన్న కెంచప్ప మరో రైలు ఎక్కి ఉత్తరాఖండ్ చేరుకున్నాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియని కెంచప్ప.. వివిధ రైళ్లు మారుతూ చివరకు జమ్ముకశ్మీర్‌కు చేరుకున్నాడు. అక్కడ ఓ హోటల్‌లో పనికి కుదిరాడు.
ఆ హోటల్ యజమాని కెంచప్ప పట్ల కనికరం లేకుండా వ్యవహరించాడు. సరిగ్గా తిండి పెట్టకుండా పనిచేయించుకోవడమే కాకుండా.. తిరిగి తన ఊరికి వెళ్లేందుకు సహాయమూ చేయలేదు. పైగా.. కెంచప్ప పారిపోకుండా రాత్రిసమయాల్లో ఓ గదిలో తాడుతో బంధించి ఉంచేవాడు. నిరక్షరాస్యుడైన అతనికి వేతనం ఇవ్వకుండా చాలా సంవత్సరాలు మోసం చేశాడు.
''జమ్ముకశ్మీర్‌లో ఓ హోటల్‌లో పనికి కుదిరా. యజమాని సరైన భోజనం ఇవ్వకుండా వేధించేవాడు. కనీసం మంచినీరు సైతం ఇచ్చేవాడు కాదు. నేను ఇన్ని సంవత్సరాలు చేసిన పనికి కనీసం జీతం కూడా సరిగా ఇవ్వలేదు.''
-కెంచప్ప
కన్నడ సైనికుల సహాయంతో..
దాదాపు రెండు దశాబ్దాల అనంతరం ఆ హోటల్‌కి కర్ణాటక గదగ జిల్లాకు చెందిన సైనికులు రావడం.. వారు కన్నడలో మాట్లాడటం గమనించిన కెంచప్ప తన గోడు వెళ్లబోసుకున్నాడు. తాను ఏ విధంగా ఇంటికి దూరమైందీ.. రెండు దశాబ్దాలుగా అక్కడ కష్టాలనుభవిస్తున్నదీ వారికి చెప్పుకున్నాడు. ఇల్లు, అతని కుటుంబం గురించి చెప్పాడు. కెంచప్పకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని రాక పట్ల వారంతా సంతోషంగా ఉన్నారు.
మొదట్లో కెంచప్ప అదృశ్యం గురించి అనేక ఫిర్యాదులు చేశారు కుటుంబసభ్యులు. ప్రస్తుతం ఆయన రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడింది.
ఇదీ చదవండి: తప్పిపోయిన 22 ఏళ్లకు తల్లిదండ్రుల చెంతకు!