Bhatkal landslide: కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తాజాగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. భత్కళ్ తాలుకాలోని ముట్టలి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మీనాయక(48), కూతురు లక్ష్మీ(33), కుమారుడు అనంత నారాయణ నాయక(32), బంధువు ప్రవీణ్ (20) మరణించారు. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఉదయం ఎనిమిది గంటలకు సహాయక చర్యలు మొదలుపెట్టగా.. మధ్యాహ్నం ఒంటిగంటకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు.
నిరాటంకంగా కురుస్తున్న వర్షాలకు భత్కళ్ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఈ వరదల కారణంగా భత్కళ్ తాలుకాలోని ముట్టల్లి, చౌతిని, శిరాలి, శంషుద్దీన్ ప్రభావితం అయ్యాయి. వెంకటాపుర, చౌతిని నదులు ఉప్పొంగడం వల్ల తీవ్ర నష్టం కలిగింది. అనేక మంది ప్రజలు నదుల్లోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పందించి.. ప్రజలను రక్షించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పడవల సహాయంతో తరలించారు. ఈ వర్షాలతో ఇంట్లోకి వరద నీరు చేరి తీవ్ర నష్టం కలిగింది. బయట పార్క్ చేసిన వాహనాలు సైతం నీటిలో కొట్టుకుపోయాయి.
ఇవీ చదవండి: