Boy Died in Hyderabad: నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన విషాదకర ఘటన పలువురిని కలచి వేస్తోంది. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 45లోని ఓ ఖాళీ స్థలంలో వర్షపు నీటి కోసం గుంత తవ్వారు. కాకినాడకు చెందిన భీమ శంకర్, లత దంపతుల కుమారుడు ఏడు సంవత్సరాల వివేక్.. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడి దుర్మరణం చెందాడు. భీమ శంకర్ దంపతులు గత ఆరు సంవత్సరాల కిందట నగరానికి వలస వచ్చారు. రోడ్డు నెంబర్ 45లో ద్విచక్ర వాహనాల షోరూంలో శంకర్ కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. ద్విచక్ర వాహనాల షోరూం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మరో కాపలాదారుడి పిల్లలతో కలిసి వివేక్ ప్రతి రోజూ ఆడుకుంటూ ఉంటాడు.
వర్షాలకు నీటితో నిండిన గుంత: అదే స్థలంలో వర్షపు నీరు వెళ్లేందుకు వీలుగా గుంత తవ్వారు. గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంత మొత్తం నీటితో నిండిపోయింది. ప్రతి రోజు మాదిరిగానే వివేక్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారి గుంతలో పడిపోయాడు. తోటి పిల్లలు విషయం చెప్పడంతో... అక్కడున్న స్థానికులు వచ్చి చూసేసరికి అప్పటికే వివేక్ నీటిలో మునిగిపోయాడు. అతడిని బయటకు తీసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అప్పటికే వివేక్ మృతి చెందాడు.
విగత జీవిగా: అప్పటి దాకా కళ్ల ముందు ఆడుకుంటున్న కుమారుడు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. తమతో ఆడుకుంటున్న వివేక్ నీటిలో మునిగిపోయి మృతి చెందడంతో తోటి పిల్లలు విషాదంలో మునిగిపోయారు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఒక దశలో బాలుడి కుటుంబసభ్యులు పోలీసులు మృతదేహాన్ని తీసుకువెళ్లనీయకుండా అడ్డుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్ధి చెప్పి బాలుడి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
నాలాలో పడి మౌనిక మృతి: ఇటీవల సికింద్రాబాద్‌లో కురిసిన వర్షానికి నాలాలో పడి 11 ఏళ్ల మౌనిక అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నగరంలో భారీగా వర్షం కురవడంతో రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. పాల ప్యాకెట్ కోసం బయటకెళ్లిన మౌనిక తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ సంఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. వర్షాలు కురుస్తుండటంతో చాలా జాగ్రత్తగా తన అన్న చేయి పట్టుకుని షాప్‌కు బయలు దేరింది. ప్రమాదం తన కాళ్లకిందే పొంచి ఉందని తెలియని మౌనిక డ్రైనేజి నాలాలపై నడుస్తూ వెళ్లింది. నాలా పైభాగం రంధ్రం ఉన్న సంగతి గమనించక దానిపై కాలు మోపింది. దాంతో నాలా పైభాగం ఊడిపోయి పాప అందులో పడిపోయి చనిపోయింది.
ఇవీ చదవండి: