యూపీలో మరో అత్యాచార ఘటన బయటపడింది. 15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం ఆమెను కత్తితో పొడిచినట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది..
గోండా జిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన 15ఏళ్ల బాలిక.. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో నలుగురు దుండగులు ఎత్తుకెళ్లారు. అనంతరం ఆమెను సమీపంలోని పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ బాలిక ప్రతిఘటించగా కత్తితో పొడిచి గాయపరిచినట్టు స్థానిక ఎస్పీ శైలేశ్ కుమార్ చెప్పారు.
ఈ ఘటనలో నిందితుడు ఖండేరుతో సహా మరో ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
అయితే.. బాలిక కుటుంబ సభ్యులకు, నిందితులకు మధ్య పాత వివాదాలున్నట్టు ఎస్పీ చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టామన్న ఆయన.. వైద్య పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మొతేరాకు 'మోదీ స్టేడియం'గా నామకరణం