Republic Day Celebration: 73వ గణతంత్ర దినోత్సవానికి యావత్ భారతావని సిద్ధమైంది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ.. భారత సైనిక సామర్థ్యాన్ని, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్ సాగనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవ వందనంతో పరేడ్ ప్రారంభం కానుంది. తర్వాత వేడుకల ప్రధాన కార్యక్రమంలో 16 కవాతు విభాగాలు పాలుపంచుకోనున్నాయి.
సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు భాగస్వామ్యం కానున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 విమానాలతో భారత వాయుసేన విన్యాసాలు ప్రదర్శించనుంది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్, అపాచీ వంటి యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాల్గొననున్నాయి.
ఈసారి మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలు కవాతులో పాల్గొననున్నాయి. తెలుగు రాష్ట్రాల శకటాలకు స్థానం దక్కలేదు. కొవిడ్ నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కుదించారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పెద్దలు, ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న 15 ఏళ్లు పైబడిన పిల్లలను మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతిస్తారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు.
ఇవీ చూడండి: