ధైర్యే సాహసే సరస్వతే అంటూ 71ఏళ్ల వయస్సులో నారాయణ భట్ అనే వ్యక్తి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అనుకున్నది సాధించకపోతే జీవితంలో కిక్కు ఉండదనుకున్నాడో ఏమో.. వెంటనే తనకు నచ్చిన సివిల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరి.. కర్ణాటకలో మొదటి ర్యాంకు కొల్లగొట్టారు. ఉత్తర కన్నడ జిల్లాలోని సిరాసీకి చెందిన నారాయణ భట్టు 1973లో ప్రభుత్వ పాలీటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అప్పుడు కూడా ఆ కోర్సులో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సంపాదించుకున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అతడిని కొలువు వెతుక్కుంటూ వచ్చింది. ఉద్యోగరీత్యా గుజరాత్ వెళ్లిన అతడు 2013లో పదవీవిరమణ పొంది, తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చారు. చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన భవననర్మాణాలపై దృష్టి పెట్టాలనుకున్నారు. కానీ అది చేయాలంటే సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఇతరుల సర్టిఫికెట్లు కావాలి. ఇతరుల గుర్తింపు మీద ఆధారపడద్దని నిర్ణయించుకున్న భట్.. తానే ఆ కోర్సు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.



సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేయాలని భావించిన నారాయణ భట్.. స్థానిక కళాశాలలో సీటు సంపాదించుకున్నారు. విద్యార్థిగా నారాయణ భట్.. ప్రతిరోజూ తరగతులకు హాజరు అయ్యేవారని, ఆ వయసులోనూ ఒక్క అనారోగ్య లీవ్ కూడా తీసుకోలేదని కళాశాల ప్రిన్సిపల్ వివరించడం అతడి పట్టుదలకు తార్కాణంగా నిలిచింది. కోర్సు మూడేళ్లలో యూనిఫాం లేకుండా నారాయణ భట్ ఎప్పుడూ రాలేదని ప్రిన్సిపల్ నిత్యానంద-కిని పేర్కొన్నారు. 71 ఏళ్ల వయసులోనూ తన తోటి విద్యార్థులతో భట్ కలివిడిగా., ఉల్లాసంగా ఉండేవారని వెల్లడించారు. అలా మొదటి ఏడాదిలో 91శాతం ఉత్తీర్ణతను సాధించిన భట్ ఇటీవల వెల్లడైన ఫలితాల్లో రాష్ట్ర మొదటి ర్యాంకును సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ నేపథ్యంలో భట్, సీఎం బసవరాజ్ బొమ్మై, చేతుల మీదుగా ప్రతిభా పురస్కారంతో పాటు జీవిత లక్ష్యమైన సివిల్ ఇంజనీరింగ్ పట్టా అందుకోనున్నారు.
'1973లో కార్వార్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ డిప్లొమాలో చదివి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాను. ఆ తరవాత గుజరాత్‌లో ఓ పరిశ్రమలో పనిచేసి.. 2013లో పదవీ విరమణ పొందాను. నా రిటైర్డ్ జీవితాన్ని గడపడానికి శిరిసికి వచ్చాను. నాకు సివిల్ నిర్మాణం గురించి అవగాహన ఉంది. అందుకే రిటైర్‌మెంట్ తరవాత నిర్మాణాన్ని ప్రారంభించాను. అయితే దానికి సర్టిఫికేట్ అవసరం. కాబట్టి సమయాన్ని వృథా చేయకుండా.. వెంటనే సివిల్ ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకుని అడ్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది'
- నారాయణ్ భట్, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్