కరోనా కాలంలో విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు.. అదే మహమ్మారి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో 700కు పైగా టీచర్లు మృతిచెందటం ఆందోళన కలగిస్తోంది.
తమను ముఖ్యమంత్రి 'కరోనా వారియర్స్' పథకంలో చేర్చాలని మధ్యప్రదేశ్‌లోని వివిధ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా సమయంలో చిన్నారులకు ఆన్లైన్ బోధనతోపాటు.. కరోనా వ్యాక్సినేషన్ వంటి విధుల్నీ నిర్వర్తించడం వల్లే టీచర్లు వైరస్ బారినపడ్డారని చెబుతున్నాయి.
భోపాల్ జిల్లాలో ప్రథమం..
నవీభాఘ్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఎస్పీ గోస్వామి ఇటీవల కరోనా బారిన పడి కన్నుమూశారు. నిజానికి... ఏప్రిల్ 6న గోవింద్‌పుర సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్.. ఆయనకు అక్కడి ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో విధులు నిర్వర్తించే బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత గోస్వామికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్‌తో పోరాడిన ఆయన మే 12న కన్నుమూశారు. భోపాల్ జిల్లాలో కరోనా విధుల్లో పాల్గొని మరణించిన ఉపాధ్యాయుల్లో గోస్వామే ప్రథమం. గోస్వామి ఎప్పుడూ అంకితభావంతో పనే చేసేవారని, ఏనాడు కూడా సెలవులు తీసుకునేవారు కాదని తన తోటి ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఇటీవలే కరోనా బారిన పడి కన్నుమూసిన కొవిడ్ యోధుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. అయితే.. ఇప్పడు ఉపాధ్యాయులకు ఆ వెసులుబాటు కల్పించాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
ఇదీ చూడండి: ఎన్నికల విధులకు హాజరైన 52 మంది టీచర్లు మృతి