ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన కర్ణాటక రామనగరలో జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. మిగిలిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం..
బెంగళూరు సుబ్రప్పనపాళయకు చెందిన రాజు అనే వ్యక్తి అప్పుల బాధను పడలేక కుటుంబంతో సహా దొడ్డమానగుండి గ్రామానికి వచ్చేశాడు. ఆ గ్రామంలోనే భార్య, పిల్లలతో సహా అతడు.. అత్త సొల్లాపూర్డమ్మ ఇంట్లో ఉండేవాడు. అతనికి రూ.11 లక్షలు అప్పులు ఉన్నట్లు సమాచారం. అయితే అప్పు ఇచ్చినవారు అతడి దగ్గరకు వచ్చి ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే రాజు(31), అతని భార్య మంగళమ్మ(28), పెద్ద కుమారుడు కృష్ణ(13), చిన్న కుమారుడు ఆకాష్(9), అత్త సొల్లాపూర్డమ్మ(48), ఆమె చిన్న కూతురు సవిత(24), సవిత కూతురు దర్శిని(4) గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పుల బాధ పడలేకే ఆ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు అంటున్నారు. ఆ ఏడుగురిలో భార్య మంగళమ్మ మృతి చెందగా మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారు మాండ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.