ఓ 65 ఏళ్ల వ్యక్తి చిరుతను ఎదిరించాడు. దానితో భీకరంగా పోరాడాడు. చిరుత విసిరిన పంజాను ఎదుర్కొని.. ప్రాణాలతో నిలబడ్డాడు. ఆరు పదులో వయసులో పులితో పోరాడి.. ప్రస్తుతం తీవ్ర గాయలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బంగాల్లో ఈ ఘటన జరిగింది. బహదుర్ రాయ్ అనే వ్యక్తి ఈ సాహసం చేశాడు.
పొలంలో ఉండగా చిరుత దాడి..
బహదుర్ రాయ్ డార్జిలింగ్ జిల్లాకు చెందిన వ్యక్తి. మిరిక్ తారాబరి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. శనివారం రాయ్.. పూల మొక్కల తోటలో గడ్డిని కోస్తూ ఉన్నాడు. అదే సమయంలో పక్కనే పొదల్లో నుంచి హఠాత్తుగా ఓ చిరుత పులి రాయ్‌పై దాడి చేసింది. దీంతో భయపడిపోయిన రాయ్.. మొదట దాని నుంచి తప్పించుకునే ప్రయత్న చేశాడు. ఆ తర్వాత రాయ్.. దానికి ఎదురుతిరిగాడు. చిరుతతో తన శక్తి మేర పోరాడాడు.
రాయ్ అరుపులు విన్న చుట్టుపక్క రైతులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. పులిని అక్కడి నుంచి తరిమేశారు. తీవ్రంగా గాయపడ్డ రాయ్‌ను.. స్థానిక ఆసుపత్రికి తరిలించారు. మెరుగైన చికిత్స కోసం నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చిరుత ఆహారం కోసమే అడవి నుంచి బయటకు వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కొన్నేళ్లుగా అడవుల్లో చిరుతల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందన్నారు.
కూతురి కోసం అడవి పందితో పోరాడి ఓడిన తల్లి..
కూతురిని కాపాడేందుకు తన ప్రాణాలనే అడ్డేసింది ఓ తల్లి. అడవి పందితో విరోచితంగా పోరాడి.. కూతురిని రక్షించింది. తాను మాత్రం ప్రాణాలను పోగొట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ విషాదం జరిగింది. ఆదివారం ఘటన జరిగినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
కోర్బా జిల్లా, పసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలియమార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలిని దువాషియా భాయి(45)గా పోలీసులు గుర్తించారు. దువాషియా, తన కూతురు రింకీని వెంట తీసుకుని మట్టి కోసం దగ్గర్లో ఉన్న పొలానికి వెళ్లింది. పారతో మట్టిని తవ్వుతుండగా హఠాత్తుగా వారిపైకి అడవి పంది వచ్చింది. రింకీపై పంది దాడి చేసింది. దీంతో కూతురిని కాపాడేందుకు.. అడవి పందిని ఎదుర్కొంది దవాషియా. తన దగ్గర ఉన్న గొడ్డలితో దానిపై దాడి చేసింది. రింకీ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుంది. అయితే, అడవి పంది దాడిలో తీవ్రంగా గాయపడ్డ దువాషియా.. చివరకు ప్రాణాలు కోల్పోయింది.