బైక్‌పై ఎంత మంది ప్రయాణించవచ్చు? ఇద్దరు! మహా అయితే ముగ్గురు. కానీ.. ఇక్కడ కనిపిస్తున్న బండిపై మాత్రం ఒకేసారి ఆరుగురు దర్జాగా కూర్చొని వెళ్లొచ్చు. అది కూడా పెట్రోల్ ఖర్చు లేకుండానే. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.
ఇదొక ఆరు సీట్ల ఎలక్ట్రిక్ బైక్. దీన్ని ఏదో దిగ్గజ కంపెనీ తయారుచేసింది అనుకుంటే పొరపాటే. నిండా పాతికేళ్లు కూడా దాటని ఓ కాలేజీ కుర్రాడు ఈ వెరైటీ బైక్ సృష్టికర్త. తనకు వచ్చిన ఓ చిన్న ఐడియానే ఇలా అద్భుతంగా మార్చాడు.
ఉత్తర్‌ప్రదేశ్ ఆజమ్గఢ్ జిల్లాలోని లోహ్రా గ్రామానికి చెందిన అష్షద్ అబ్దుల్లా అనే యువకుడు ఈ సిక్స్ సీటర్ ఈవీని రూపొందించాడు. అబ్దుల్లా 12వ తరగతి తర్వాత ఐటీఐ-ఎలక్ట్రీషియన్ కోర్స్ పూర్తిచేశాడు. ప్రస్తుతం బీసీఏ చదువుతున్నాడు. తనకు వచ్చిన చిన్న ఆలోచనతో.. ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారుచేశాడు. ఇందుకోసం ముందుగా గూగుల్, యూట్యూబ్ ద్వారా ఈవీల గురించి తెలుసుకున్నాడు. నెల రోజులు కష్టపడి అనుకున్నది సాధించాడు. ఇందుకు తన కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారని చెబుతున్నాడు అబ్దుల్లా.
"రోజురోజుకూ పెట్రోల్ ధర పెరుగుతోంది. చాలా మంది ఖర్చు భరించలేకపోతున్నారు. నాది కూడా రైతు కుటుంబమే. పెట్రోల్ కొనడంలో ఇబ్బందులు మాకు తెలుసు. అందుకే అందరికీ ఉపయోగపడేలా ఉండాలన్న ఆలోచనతో ఈ సైకిల్‌ను రూపొందించాను. ఇందుకోసం రూ.10-12వేలు ఖర్చు అయింది. పూర్తిగా పాత సామాను వాడాను. వాణిజ్యపరంగా ఈ సైకిల్‌ను తయారు చేసి పల్లెల్లో ఉండేవారికి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలన్నది నా కోరిక. పేటెంట్ పొందేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తాం."
--అష్షద్ అబ్దుల్లా, 6 సీట్ల ఎలక్ట్రిక్ బైక్ రూపకర్త
ఈ బైక్‌తో.. పర్యావరణానికి హానిలేకుండా.. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఈ బైక్ గురించి తెలుసుకున్న వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర.. అబ్దుల్లా ప్రతిభను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఈ యువకుడు ఇప్పుడో స్టార్ అయిపోయాడు. అనేక మంది.. ఈ కుర్రాడి తెలివిని మెచ్చుకుంటున్నారు.