ShivLing In River: ఉత్తర్‌ప్రదేశ్.. మౌ జిల్లాలోని ఘాగ్రా నదిలో భారీ వెండి శివలింగం లభ్యమైంది. దోహ్రిఘాట్ గ్రామంలో బిందెను కడిగేందుకు మట్టి తీస్తున్న ఓ వ్యక్తి చేతికి ఏదో తగిలినట్లు అనిపించి.. మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో తవ్వగా 53 కేజీల భారీ శివలింగం బయటపడింది. ఆ శివలింగాన్ని చూడడానికి గ్రామస్థులు ఎగపడడం వల్ల.. పోలీసులు శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ జరిగింది.. దోహ్రిఘాట్ గ్రామానికి చెందిన రామ్మిలాన్ అనే వ్యక్తి.. నిత్యం ఘాగ్రా నదిలో స్నానమాచరిస్తుంటాడు. అయితే ఆదివారం ఉదయం స్నానం చేశాక.. తాను తెచ్చిన పూజకు సంబంధించిన నీటి బిందెను శుభ్రం చేద్దామని కొంచెం మట్టిని తీశాడు. అప్పుడు అతడి చేతికి ఏదో తగిలినట్లు అనిపించింది. వెంటనే చేతితో మట్టిని తవ్వడం ప్రారంభించాడు. అతడికి సమీపంలో చేపలు పడుతున్న ఇద్దరు జాలరులను కూడా సాయానికి పిలిచాడు. ముగ్గురు కలిసి తవ్వగా అక్కడ ఉన్న భారీ వెండి శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయి బయటకు తీశారు.
ఆ తర్వాత రామ్మిలాన్ కుమార్తె తన తలపై వెండి శివలింగాన్ని పెట్టుకుని వారి గ్రామంలో ఉన్న పురాతన శివాలయానికి తీసుకెళ్లింది. అక్కడ ఆ శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు రామ్మిలాన్ కుటుంబసభ్యులు. విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా శివలింగాన్ని చూడడానికి ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. శివలింగాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, శివలింగాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరికీ అనుమతిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు కూడా వెండి శివలింగాన్ని చూడడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఇదీ చదవండి: అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం.. ఎక్కడంటే?