Bengal Rape Case: బంగాల్ పూర్వ వర్ధమాన్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. 9 ఏళ్ల బాలికపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గాల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఓ గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. తొమ్మిదేళ్ల బాలిక దాహం వేసి మంచి నీళ్లు తాగేందుకు పంపు వద్దకు వెళ్లింది. ఈ సమయంలో నిందితుడు ఆమెను బలవంతంగా ఎవరూ లేని ఓ ఇంట్లోకి లాక్కెళ్లాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అయితే బాలిక ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లింది. జననాంగాల నుంచి తీవ్ర రక్తస్రావమవుతున్న చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు హడలిపోయారు. బాలిక జరిగిన విషయం చెప్పగా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని తరఫున వాదించేందుకు ఏ లాయర్ ముందుకు రాకపోవడం వల్ల కోర్టు అతనికి ఏప్రిల్ 11వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు బీర్భూమ్ వాసి అని, డ్రైవర్గా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు గ్రామానికి వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు వివరించారు.
Punjab Rape Case: పంజాబ్ కపూర్థలా జిల్లాలో ఐదేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాయి. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మిఠాయిల ఆశజూపి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అరెస్టు చేసిన నిందితుడిని మహమ్మద్ సౌరవ్గా పోలీసులు గుర్తించారు. అతడు బిహార్ నుంచి వచ్చిన వలస కూలీ అని పేర్కొన్నారు. బాలిక తల్లిదండ్రులు కూడా వలస కార్మికులేనని, వారు పనికి వెళ్లి వచ్చాక బాధితురాలు జరిగిన విషయం చెప్పిందన్నారు. అనంతరం చిన్నారి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని చెప్పారు.
ఇదీ చదవండి: దళితుడిపై దారుణం.. హింసించి.. చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి..