కరోనా మహమ్మారి రక్తసంబంధాలను తెంచేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలను చిదిమేస్తోంది. ఇలాంటి విషాదకర ఘటనే మహారాష్ట్రలోని సోలాపుర్‌లో జరిగింది. మాదా తాలుకాలోని తెంభుర్నికి గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో.. పదిరోజుల వ్యవధిలో ఐదుగురిని కొవిడ్ బలితీసుకుంది.
ప్రస్తుతం ఆ కుటుంబంలో భయ్యా షేక్ అనే వ్యక్తి సహా అతని 16 నెలల కుమార్తె మాత్రమే సజీవంగా ఉన్నారు. ఏప్రిల్ నెలలో అతడి తండ్రికి మొదటగా కరోనా సోకింది. అనంతరం మిగతా వారికీ వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అయితే.. చికిత్స పొందుతూ భయ్యా షేక్ తండ్రి ఏప్రిల్ 27న ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం మే1న అతని తల్లి వైరస్‌కు బలైంది.
కన్నీటి తడి ఆరకముందే..
తల్లిదండ్రులు చనిపోయారన్న బాధ నుంచి ఇంకా కోలుకోకముందే.. మే 5న భయ్యా షేక్ సోదరుడు ఇక్బాల్ హనీఫ్ షేక్(31) మహమ్మారి కారణంగా మృతి చెందాడు. అతని సవతి తల్లి రుక్షానా హనీఫ్ షేక్ కూడా కొవిడ్‌తో ప్రాణాలు విడిచింది. మే 6న భయ్యా షేక్ భార్య అర్జిత(24).. కరోనా కాటుకు కన్నుమూసింది. దాంతో వారి 16 నెలల కూతురు తల్లిలేనిదిగా మిగిలింది. మహమ్మారి నింపిన విషాదంతో ఆ తండ్రి, కుమార్తె మాత్రమే ఇప్పుడు మిగిలారు.
ఇదీ చూడండి: జూపార్కులో కరోనాతో ఆడ సింహం మృతి
ఇదీ చూడండి: కరిచిందని.. కుక్కను తుపాకీతో కాల్చి..