ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న వాహనాల పైకి రైలు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రైలు పట్టాలు దాటే ప్రదేశంలో గేట్లు తెరిచి ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
లఖ్‌నవూ- చండీగఢ్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. మీరన్పుర్ కట్ర రైల్వే స్టేషన్ దాటిన తర్వాత.. పట్టాలు దాటుతున్న రెండు ట్రక్కులు, ఓ కారు, రెండు బైక్‌లను ఢీ కొట్టింది. ఆ తర్వాత రైలు పట్టాలు తప్పిందని స్థానిక ఎస్పీ సంజీవ్ బాజ్‌పాయ్ చెప్పారు.
మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైలు వస్తున్న సమయంలో గేట్లు ఎలా తెరుచుకున్నాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
సీఎం సంతాపం..
ప్రమాద ఘటనపై సీఎం యోగి అదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
ఇదీ చదవండి: బాధ్యతారాహిత్యం.. భరోసానివ్వని ప్రభుత్వం!
ఇదీ చదవండి: ప్రముఖ మతగురువు కన్నుమూత- మోదీ సంతాపం