దేశవ్యాప్తంగా కొవిడ్ రోగుల కోసం 2,084 ఆస్పత్రుల్లో 4.68 లక్షల పడకలను ఏర్పాటు చేసినట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. కరోనా రెండో దశ విజృంభణ వేళ రోగులకు అందుబాటులో ఉన్న పడకలు సహా వైరస్ను ఎదుర్కోవటానికి అవసరమైన సామగ్రి, సేవల లభ్యతపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వివరణ కోరగా.. ఈ మేరకు అఫిడవిట్ సమర్పించింది కేంద్రం.
భారీ ఏర్పాట్లు
కరోనా నియంత్రణకు భారీ ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు తెలిపింది కేంద్రం. దీనిలో భాగంగా కొవిడ్ కేర్ సెంటర్లు(12,673), డెడికేటెడ్ కొవిడ్ హెల్త్ సెంటర్లు(4,043), డెడికేటెడ్ కొవిడ్ ఆస్పత్రులు(డీసీహెచ్) ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 2,084 డీసీహెచ్లు ఉండగా.. అందులో 89 కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో.. మిగిలిన 1,995 రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని తెలిపింది. దేశంలో మొత్తం 18,52,265 పడకలు ఉండగా.. అందులో డీసీహెచ్ల్లో 4,68,974 పడకలు ఉన్నాయని వివరణ ఇచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులను కూడా డీసీహెచ్లుగా మార్చినట్లు పేర్కొంది.
'వైద్య సిబ్బందిని పెంచుకోండి'
జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం.. ఈ విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బందిని మరింత పెంచుకోవచ్చని కేంద్రానికి సిపార్సు చేసింది. అలాగే సాయుధ, పారామిలటరీలోని వైద్య సిబ్బందిని వ్యాక్సినేషన్ ప్రక్రియకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇదీ చూడండి: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా కేసులు