ఉత్తర్‌ప్రదేశ్‌లో వైద్యుల నిర్లక్ష్యం ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. శ్రీకేష్ కుమార్ అనే వ్యక్తి మెురాదాబాద్ నగరపాలకసంస్థలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. నవంబరు 18న రోడ్డుపై వెళ్తుండగా.. ద్విచక్రవాహనం ఢీకొని అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అది గమనించిన స్థానికులు అత్యవసర చికిత్స కోసం శ్రీకేష్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. శ్రీకేష్‌ను పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు. రాత్రి కావటంతో శవపరీక్ష ఉదయం నిర్వహిస్తామని చెప్పి శ్రీకేష్ మృతదేహాన్ని మార్చురీలోని ఫ్రీజర్‌లో ఉంచారు.
ఉదయం శవపంచనామాకు సంబంధించిన పత్రాలపై వైద్యులు కుటుంబసభ్యుల సంతకాలు తీసుకున్నారు. 7 గంటల తర్వాత శ్రీకేష్ కదలడం చూసిన ఆయన కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన వైద్యసిబ్బంది శ్రీకేష్‌ను మేరఠ్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. అప్పటి నుంచి చావుబతుకుల మధ్య పోరాడుతున్న శ్రీకేష్ మంగళవారం సాయంత్రం మృతిచెందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివ్ సింగ్ వెల్లడించారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:చనిపోయిన ఏడు గంటలకు మళ్లీ బతికిన వ్యక్తి!