3 Year Old Boy Climbed Umling La Pass : మౌంట్ ఎవరెస్ట్‌కన్నా ఎత్తయిన పర్వతంపైకి వెళ్లొచ్చని అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు కర్ణాటకకు చెందిన ఓ బాలుడు. దక్షిణ కన్నడ జిల్లా సూలియాకు చెందిన జజీల్ రెహ్మాన్.. లద్ధాఖ్లోని ఉమ్లింగ్ లా పాస్‌కు బైక్‌పై వెళ్లొచ్చాడు. మూడున్నర ఏళ్ల వయసున్న జజీల్ సాధించిన ఘనతకు.. ఇండియన్ రికార్డ్ బుక్‌లో చోటు దక్కే అవకాశముంది.
జజీల్ తల్లిదండ్రులు.. తౌహీద్ రెహ్మాన్, జష్మియా. తౌహీద్‌కు ప్రయాణాలు చేయడం హాబీ. గతంలో స్నేహితులతో కలిసి కారులో భారత దేశం మొత్తం తిరిగారు. లద్ధాఖ్‌కు ఇప్పటికే 6 సార్లు వెళ్లొచ్చారు. అయితే.. ఈసారి మాత్రం కాస్త భిన్నమైన యాత్ర తలపెట్టారు. భార్య, కుమారుడితో కలిసి బైక్‌పై లద్ధాఖ్ వెళ్లి రావాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురూ ఆగస్టు 15న సూలియాలో బయలుదేరారు. 19 రోజుల్లో దాదాపు 5వేల కిలోమీటర్లు ప్రయాణించి.. గత శనివారం లద్ధాఖ్లోని ఉమ్లింగ్ లాకు వెళ్లారు. అక్కడ జాతీయ జెండా, కర్ణాటక జెండా, తులునాడు జెండా ఆవిష్కరించారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డు..
లద్ధాఖ్‌లో.. భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో ఉండే ఉమ్లింగ్ లా ప్రాంతం.. భౌగోళికంగా ఎంతో సంక్లిష్టమైంది. ఉమ్లింగ్ లా.. సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు (17,498 అడుగుల) కంటే ఇదే అధికం. ఈ ప్రాంతంలో చిషుమ్లే నుంచి దెమ్చోక్ వరకు ఉండే 52 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిగా పేరుగాంచింది. ఇక్కడ ఆక్సిజన్.. సాధారణ స్థాయితో పోల్చితే 43శాతం మాత్రమే ఉంటుంది. ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీలకన్నా తక్కువకు పడిపోతుంది. అలాంటి ప్రాంతానికి తల్లిదండ్రులతో కలిసి బైక్‌పై వెళ్లాడు జజీల్ రెహ్మాన్.


"ఉమ్లింగ్ లా ప్రాంతానికి చేరుకోగానే.. ఆక్సిజన్ స్థాయిలు సరిపోక మా కుమారుడు ఇబ్బంది పడ్డాడు. కొంత సమయానికి ఈ వాతావరణానికి అలవాటుపడ్డాడు. నిరంతరం వైద్య నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ మేము యాత్రను కొనసాగించాం. ఆహారం తప్ప మిగిలిన ఏ విషయాల్లోనూ మా కుమారుడు ఇబ్బంది పడలేదు. మా ఊర్లో దొరికే ఆహారం ఇక్కడ లభించకపోవడం ఒక్కటే సమస్య. నా కుమారుడు, భార్య సంతోషంగా ఉన్నారు. రోజుకు 300-350 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాం. రోడ్డు బాగుంటే 400 కిలోమీటర్లు వెళ్తున్నాం. మొత్తం 24 రోజుల యాత్ర పూర్తి చేసుకుని.. మా స్వస్థలానికి తిరిగి వెళ్తున్నాం" అని చెప్పారు తౌహీద్. ఉమ్లింగ్ లాకు చేరుకోగానే.. స్థానికంగా ఉండే ఇండియన్ ఆర్మీ అధికారులు, సిబ్బంది.. తమకు స్వాగతం పలికి, సన్మానం చేశారని తెలిపారు.
ఆమె రికార్డ్ బ్రేక్..
ఉమ్లింగ్ లాకు వెళ్లిన అతి పిన్నవయస్కురాలిగా.. దిమాహీ పారాటే రికార్డును బ్రేక్ చేశాడు జజీల్. దిమాహీ.. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన బాలిక. 2022 ఆగస్టు 12న.. ఏడేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి ఉమ్లింగ్ లాకు కారులో వెళ్లింది దిమాహీ. అయితే.. ఇప్పుడు జజీల్ మాత్రం.. మూడున్నరేళ్ల వయసులో అమ్మనాన్నలతో కలిసి బైక్‌పై వెళ్లడం విశేషం.
శభాష్ కార్తికేయ.. అరుదైన ఘనత సాధించిన 13 ఏళ్ల బాలుడు
కొండల్లోనూ దూసుకెళ్తున్న 'బుల్లెట్' రాణులు.. 20 గంటల్లో 1,700 కి.మీ ప్రయాణించి రికార్డ్..