జమ్ముకశ్మీర్ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ఘటనలో నలుగురు భారత సైనికులకు గాయాలయ్యాయి.
అఖ్నూర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఖౌర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడిందని భారత అధికారులు తెలిపారు. మోర్టార్ షెల్స్ విసిరి దాడులకు పాల్పడుతూ ఉగ్రవాదులను కశ్మీర్లోకి చొరబడేలా చేసేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే భద్రతా దళాలు ప్రతిఘటించి ముగ్గురు ముష్కురులను మట్టుబెట్టాయని పేర్కొన్నారు.
మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలు పాక్ భూభాగంలో పడి ఉన్నాయని, పాక్ సైన్యం ఆ మృతదేహాలను ఇంకా తీసుకెళ్లలేదని అధికారులు చెప్పారు. ఈ ఏడాది జరిగిన కాల్పుల ఉల్లంఘన ఘటనల్లో ఇదే అతిపెద్దదని తెలిపారు.