ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఇద్దరు బాలికలు మృతి చెందడం కలకలం రేపుతోంది. జిల్లాలోని బాబురాహా గ్రామంలో ముగ్గురు బాలికలు పొలంలో అపస్మారక స్థితిలో కనిపించారు. వారిని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో బాలికను కాన్పుర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
గ్రామానికే చెందిన ముగ్గురు బాలికలు పొలంలో గడ్డి తెచ్చేందుకు బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లారు. చీకటి పడినా బాలికలు ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు గాలించారు. చివరకు.. పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. వారి కాళ్లు, చేతులు దుప్పట్టాతో కట్టేసి ఉన్నాయని, నోటి నుంచి నురగలు కూడా వచ్చాయని కుటుంబసభ్యులు చెప్పారు.
'విషం ఇచ్చారు'
వీరి వయసు 13, 16, 17 ఏళ్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు పోలీసులు. బాలికలకు ఎవరో బలవంతంగా విషం ఇచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల వైఖరి చూస్తుంటే కేసును.. తప్పుదోవ పట్టించేయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ ఆరోపించారు. స్వతంత్ర సంస్థతో బాలికల కేసును దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నిలిచిపోయిన రైళ్లు- ప్రయాణికులకు ఆహారం, నీరు సరఫరా