బంగాల్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 25శాతం మందిపై క్రిమినల్ కేసులున్నట్లు అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. మార్చి 27న జరిగే ఎన్నికల బరిలో నిలిచే 191 మంది అభ్యర్థుల ప్రమాణ పత్రాలను ఏడీఆర్, పశ్చిమ్‌బంగా ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా విశ్లేషించాయి. అందులో 48 మంది తమపై క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడించారని ఆ నివేదిక పేర్కొంది.
![25 per cent candidates contesting Bengal polls phase-1 declaredag criminal cases ainst themselves: ADR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11077126_yvvv.jpg)
నేర చరిత్ర..
⦁ 48 మంది(25%) అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో.. సీపీఐ(ఎం) నుంచి 10, భాజపా 12, తృణమూల్ 10, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఉన్నారు.
⦁ 42 మంది (22%)పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. వారిలో సీపీఐ(ఎం) నుంచి 9, భాజపా 11, తృణమూల్ 8, ఒకరు కాంగ్రెస్ నుంచి ఉన్నారు.
⦁ మహిళలపై నేరాల కేసులు 12 మందిపై, ఒకరిపై అత్యాచారం కేసు, 8 మందిపై హత్య కేసులున్నాయి.
విద్యార్హతలు..
96 మంది అభ్యర్థులు (50శాతం) 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకోగా, 92 మంది (48శాతం) పట్టభద్రులని నివేదిక తెలిపింది. మరో ముగ్గురు డిప్లొమా చేసినట్లు వెల్లడించింది.
ఆస్తులు..
మొత్తం 191 మందిలో 19 మంది (10%) కోటీశ్వరులున్నారు. వారిలో తృణమూల్ నుంచి 9, భాజపా 4, సీపీఐ(ఎం), కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఉన్నారు. తొలి దశ అభ్యర్థుల సరాసరి ఆస్తుల విలువ రూ.43.77 లక్షలని నివేదిక పేర్కొంది.
294 శాసనసభ స్థానాలున్న బంగాల్లో 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27తో మొదలై ఏప్రిల్ 29తో ముగియనున్నాయి. ఫలితాలు మే2న వెలువడుతాయి.
ఇదీ చూడండి: మూడోసారి గెలిస్తే 'మోదీ'కి ప్రత్యామ్నాయంగా 'దీదీ'!