భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2011 నుంచి దేశంలో 16 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేవలం గతేడాది (2022)లోనే 2.25లక్షల మంది పౌరసత్వాన్ని త్యజించినట్లు తెలిపింది. ఒకే ఏడాదిలో ఇంతమంది పౌరసత్వాన్ని వదులుకోవడం ఇదే తొలిసారి కాగా 2020లో ఈ సంఖ్య అతితక్కువగా ఉందని పేర్కొంది.
ప్రతి ఏటా పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్యకు సంబంధించిన వివరాలను విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ రాజ్యసభలో వెల్లడించారు. 2015లో 1.31లక్షలు, 2016లో 1.41లక్షలు, 2017లో 1.33లక్షలు, 2018లో 1.34లక్షలు, 2019లో 1.44లక్షల మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలిపారు. 2020లో అతి తక్కువగా 85వేల మంది తమ సిటిజెన్‌షిప్‌ను వదులుకున్నారని చెప్పారు. కాగా 2021లో 1.63లక్షల మంది, 2022లో అత్యధికంగా 2,25,620 మంది పౌరసత్వాన్ని విడిచిపెట్టారన్నారు. మొత్తంగా 2011 నుంచి ఇప్పటివరకు 16లక్షల 60వేల మంది ఇండియన్ సిటిజెన్‌షిప్‌ను వదులుకున్నారని విదేశాంగశాఖ మంత్రి వెల్లడించారు.
గడిచిన మూడేళ్లలో కేవలం ఐదుగురు భారతీయులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరసత్వాన్ని పొందినట్లు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వీటితోపాటు 135 దేశాలు భారతీయులకు ఇచ్చిన పౌరసత్వం ఇచ్చిన వివరాలను అందించారు. ఇక కొంతకాలంగా అమెరికా కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటిస్తున్న విషయాన్ని భారత ప్రభుత్వం గమనిస్తోందని విదేశాంగశాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ పేర్కొన్నారు. ఇందులో కొందరు హెచ్-1బీ, ఎల్1 వీసాలు పొందిన వారు కూడా ఉండవచ్చని అన్నారు. ఈ సమస్యను అమెరికా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు లేవనెత్తుతున్నామని.. పరిశ్రమ వర్గాలు, వాణిజ్య సంస్థలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తూనే ఉన్నామని అన్నారు.