Portraits with Electronic Waste: అసోంకు చెందిన రాహుల్ పరీక్ అనే కుర్రాడికి బాల్యం నుంచే లలిత కళలపై.. అమితమైన ఆసక్తి. అదే అతన్ని కొత్త మార్గాల్లో చిత్రాలు రూపొందించేలా ప్రోత్సహించింది. మూడో తరగతి నుంచే కాన్వాస్‌పై బొమ్మలు గీయడంలో మెలకువలు నేర్చుకున్న రాహుల్.. ఆ తర్వాత నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుని రాణిస్తున్నాడు. దేశవ్యాప్తంగా రోజు రోజుకూ అధికంగా పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో కొత్త ఆవిష్కరణలు చేయచ్చని నిరూపిస్తున్నాడు.
తల్లిదండ్రుల సూచనతో ఇంటర్మీడియెట్ వరకూ పూర్తిగా చదువుపై దృష్టి పెట్టిన రాహుల్ డిగ్రీలోకి వచ్చే సరికి మళ్లీ తన సృజనాత్మకతకు పదును పెట్టాడు. మొదట్లో భారతీయ సంగీత కళాకారులైన నేహా కక్కర్, అర్మాన్ మాలిక్, హర్షదీప్ కౌర్ చిత్రాలను వేశాడు. సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఆ చిత్రాలకు మంచి స్పందన రావడంతో కొత్త ఆలోచనలతో బొమ్మలు వేసే ప్రయత్నాల్లో విజయం సాధించాడు. అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ చిత్రాన్ని పర్యావరణానికి మేలు చేసేలా.. మొబైల్ ఫోన్, కంప్యూటర్ వ్యర్థాలతో తయారుచేసి ఆ ఫొటోను ఆయనకు ఈ మెయిల్ ద్వారా పంపాడు. మొదట్లో ఎటువంటి స్పందన రాలేదనీ.. కొన్ని ప్రయత్నాల తర్వాత తన ప్రతిభకు గుర్తింపు వచ్చిందని రాహుల్ తెలిపాడు. స్వయంగా సోనోవాల్‌కు చిత్రాన్ని అందించాననీ.. దాన్ని ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారని గుర్తు చేసుకున్నాడు.
వైర్లు, కంప్యూటర్ మదర్‌బోర్డులు, చిప్స్ ఉపయోగించి 2019లో రాహుల్ తయారు చేసిన కొన్ని చిత్రాలు..'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు దక్కించుకున్నాయి. 2020లో భారత్- శ్రీలంక మధ్య టీ20 జరుగుతున్నప్పుడు.. విరాట్ కోహ్లీ చిత్రాన్ని నేరుగా ఇచ్చేందుకు వెళ్లగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని తెలిపాడు. ఆ తర్వాత మీడియాలో తన చిత్రాల గురించి వచ్చిన వార్తలను చూసి కోహ్లీ నుంచి పిలుపు వచ్చిందని అన్నాడు. కోహ్లీకి నేరుగా ఈ వ్యర్థాలతో చేసిన చిత్రాన్ని ఇచ్చాననీ.. తన ప్రతిభకు మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత 2020 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో సైతం తనకు చోటు లభించిందని చెప్పాడు.
గువాహటిలో జరిగిన ఫిలింఫేర్‌లో అవార్డుల ఉత్సవంలో అక్షయ్ కుమార్‌కు ఈ వ్యర్థాలతో చేసిన బొమ్మను ఇచ్చానని తెలిపాడు. తన తదుపరి చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాలని రాహుల్ భావిస్తున్నాడు. ఈ వ్యర్థాలతో మరిన్ని చిత్రాలు తయారు చేసి 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో చోటు సంపాదించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.
ఇదీ చదవండి: పెంపుడు జంతువులుగా 'డైనోసర్ బల్లులు'... రూ.9వేలు పెడితే..