హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ అవాంఛనీయ ఘటనలు లేకుండా సాగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసేనాటికి లైన్లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. సాయంత్రం 5గంటల నాటికి 65.92 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. లాహౌల్-స్పితి జిల్లాలోని స్పితి ప్రాంతంలోని తాషిగ్యాంగ్‌లో 15,256 అడుగుల ఎత్తులో ఈసీ.. పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ 52 మంది ఓటర్లు ఉండగా 51 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్రంలో ఉన్న 68 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 55,07,261 ఓటర్లు రాష్ట్రంలో ఉండగా పురుష ఓటర్లు 27,80,208 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 22,27,016 మంది ఉన్నారు. కాగా తొలిసారి ఓటు నమోదు చేసుకున్న యువ ఓటర్లు 1,86,681 ఉన్నారు. మొత్తం 7881 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. 2017 ఎన్నికల్లో 75.57శాతం పోలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికల్లో మొత్తం 412 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, మాజీ సీఎం వీరభద్రసింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్, భాజపా మాజీ చీఫ్ సత్పాల్ సింగ్ సట్టి తదితరులు పోటీలో ఉన్నారు. ప్రశాంతంగా జరిగిన పోలింగ్‌లో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. డిసెంబరు 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిలాస్‌పూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. మాజీ ముఖ్యమంత్రులు శాంత కుమార్, ప్రేమ్ కుమార్ ధుమాల్, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎల్పీ లీడర్ ముఖేష్ అగ్నిహోత్రి కుటుంబ సభ్యలుతో కలిసి ఓటు వేశారు.
కాగా ఈ ఎన్నికల్లో స్పూర్తిదాయకమైన ఘటన ఒకటి జరిగింది. మండీ జిల్లా బల్హ్ అసెంబ్లీ నియోజకవర్గం లుహాఖర్ గ్రామ పంచాయతీకి చెందిన మణిరామ్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. శనివారం ఉదయం మణిరామ్ తండ్రి మరణించాడు. అయితే తండ్రి పోయిన బాధలో ఉన్నప్పటికీ మనిరామ్ ఓటేసే బాధ్యతను మరవలేదు. తండ్రి దహన సంస్కారాలు పూర్తి చేసుకొని నేరుగా ఓటింగ్ కేంద్రానికి వచ్చాడు. కంటి నిండా దుఖం కమ్మున్నప్పటికి తన ఇద్దరు సోదరులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. బలమైన ప్రజాస్వామ్యానికి, దేశ అభివృద్ధికి ఓటు ఎంత విలువైనదని మణిరామ్ తెలిపాడు.