తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికలపైన, కొన్ని రాష్ట్రాల్లో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికలపైన లోతైన ప్రభావం చూపనున్నాయి. గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో గెలవడం దాని ఎజెండాకు ఊతమిస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపు ప్రతిపక్షాలకు ఆశాకిరణంలా మెరుస్తోంది. అదే సమయంలో గుజరాత్‌లో 13 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీగా గుర్తింపు పొందనున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకత్వం కోసం కాంగ్రెస్‌తో పోటీపడనుంది. ఇప్పటికే దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపాపై ఘన విజయం సాధించిన ఆప్ రెట్టించిన ఉత్సాహంతో భావి ఎన్నికల్లో తలపడనుంది.
అయితే, లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఢీకొనడం అంత తేలిక కాదని తాజా ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. హిందుత్వ, జాతీయవాదం, అభివృద్ధి అనే నినాదాలతో గుజరాత్‌లో భాజపా ప్రతిపక్షాలను తుడిచిపెట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా ఓటమి చవిచూసినా దానికి పాత పింఛను విధాన పునరుద్ధరణ డిమాండ్, మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్ నిర్లక్ష్య ధోరణి, టికెట్ల పంపిణీలో అవకతవకలు, తిరుగుబాటు అభ్యర్థుల బెడద వంటి స్థానిక అంశాలే కారణం. అయినా హిమాచల్‌లో భాజపాపై కాంగ్రెస్ కేవలం 1 శాతంకన్నా తక్కువ ఓట్ల తేడాతో గెలిచింది. అదే గుజరాత్‌లో భాజపా 53 శాతం ఓట్లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ ఎన్నికల ఫలితాల వల్ల ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడించాయే తప్ప తగ్గలేదనీ, మోదీ బ్రాండ్ చెక్కుచెదరలేదని భాజపా వర్గాలు ఉద్ఘాటిస్తున్నాయి. సమర్థ పాలన, భావజాలానికి సంబంధించి ఓటర్లు ఇతర పార్టీలకన్నా మోదీనీ, భాజపానే విశ్వసిస్తున్నారని గుజరాత్, ఇంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని చెబుతున్నాయి.
దేశంలో ఇప్పటికీ భాజపాయే బలమైన పార్టీ అనీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడం తేలిక కాదని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన రాజనీతి శాస్త్ర ఆచార్యుడు మణీంద్రనాథ్ ఠాకుర్ వ్యాఖ్యానించారు. అయితే, హిమాచల్‌లో కాంగ్రెస్ విజయం భాజపా అజేయం కాదని హెచ్చరిస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపించే కొద్దీ జాతీయ అంశాలు, మోడీ ఇమేజ్ ప్రాధాన్యం వహిస్తాయని భాజపా సీనియర్ నాయకుడు ఒకరు ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లను ఆకట్టుకోవడంలో భాజపాకు మోదీ తురుఫు ముక్కలా పనిచేస్తారన్నారు.
కాంగ్రెస్‌కు కష్టే ఫలి
భాజపాకున్నంత సంస్థాగత బలం, వనరులు, సైద్ధాంతిక పటిమ, మోదీ వంటి నాయకుల ఆకర్షణ శక్తి కాంగ్రెస్‌కు లేకపోయినా హిమాచల్‌లో గెలవడం విశేషం. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన ఖాతాలో మూడవ రాష్ట్రం హిమాచల్‌ను వేసుకున్నది. దశాబ్దానికి పైనుంచి ఉత్తర భారత రాష్ట్రాల్లో క్షీణించిపోతున్న కాంగ్రెస్‌కు హిమాచల్ గెలుపు కొత్త ఊపునిస్తోంది. వచ్చే ఏడాది రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లతోపాటు మధ్యప్రదేశ్, కర్ణాటకలలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఆ రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్‌లు హోరాహోరీ తలపడనున్నాయి. అక్కడ కాంగ్రెస్ జయాపజయాలు లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ స్థాయిని నిర్ణయిస్తాయి.
ఆప్‌లో రెట్టించిన ఉత్సాహం
దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో భాజపాపై ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) హిమాచల్‌లో ఒక్క శాతం ఓట్లను మాత్రమే సాధించింది. కనీసం ఒక్క సీటునైనా గెలుచుకోలేకపోయింది. అయితే, గుజరాత్‌లో 13 శాతం ఓట్లు, 5 సీట్లు గెలిచి జాతీయ పార్టీ హోదా పొందనున్నది. ఇంతకుముందు పంజాబ్‌లో ఆప్ అధికారం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ ఓటమి స్వయంకృతాపరాధమనీ, ఆప్‌కు విజయాన్ని తానే బంగారు పళ్ళెంలో పెట్టి అందించిందని కాంగ్రెస్ నాయకుడొకరు వాపోయారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు భాజపా ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతుంటే, కాంగ్రెస్ పార్టీకి ఆప్ నుంచి ముప్పు ఎదురవుతోందని మణీంద్ర నాథ్ ఠాకుర్ హెచ్చరించారు. ఇంతవరకు భాజపా, కాంగ్రెస్‌లే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆప్ పోటీ చేయడం వల్ల భాజపా వ్యతిరేక ఓట్లు చీలి, కాంగ్రెస్‌కు నష్టం కలిగించవచ్చన్నారు. కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడకపోతే దానితో జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకత్వం కోసం ఆప్ పోటీపడవచ్చు కూడా. గుజరాత్‌లో భారీ ఓటమి వల్ల కాంగ్రెస్‌కు జాతీయస్థాయిలో బేరమాడే శక్తి సన్నగిల్లవచ్చు. ఆ పార్టీ నుంచి నాయకుల వలసలు పెరగవచ్చు. ఏతావాతా వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణలను మార్చేయబోతున్నాయి.