బిహార్లో అనుమానాస్పద మరణాలు(illicit liquor death) మరోసారి కలకలం రేపుతున్నాయి. పశ్చిమ చంపారన్, గోపాల్గంజ్ జిల్లాల్లో రెండు రోజుల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు. మరణాలకు కల్తీ మద్యమే కారణమని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమ చంపారన్ జిల్లాలోని తెల్హువా గ్రామంలో గురువారం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, గోపాల్గంజ్ జిల్లాలోని కుషాహర్, మహ్మద్‌పుర్ గ్రామాల్లోనూ అనుమానాస్పద మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం మరో ఆరుగురు మరణించగా.. జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16కు పెరిగింది.
కల్తీ మద్యంపైనే అనుమానం!
అయితే కల్తీ మద్యం(Poisonous Liquor) సేవించడం వల్లే వీరంతా మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు అధికారులు. అస్వస్థతకు గురైన మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే మరికొందరికి కంటిచూపు మందగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆనందంగా దీపావళి జరుపుకోవాల్సిన ఆయా ప్రాంతాల ప్రజలు.. అకస్మాత్తు మరణాలతో శోకసంద్రంలో మునిగిపోయారు. తీవ్ర భయాందోళ చెందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: మూడు నెలల పసికందుతో సహా కుటుంబం మొత్తం ఆత్మహత్య!