ఎక్కడైనా ఒక ట్రైన్ వచ్చిన తర్వాత ఆ ట్రాక్‌పైకి మరో ట్రైన్ వస్తుంది. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రిసియా రైల్వే స్టేషన్లో మాత్రం ఓ వింత ఘటన జరిగింది. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారి షాక్ అయినప్పటికీ త్రుటిలో పెద్ద అపాయం నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందంటే...
శనివారం ఉదయం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రిసియా రైల్వే స్టేషన్‌కు రెండు రైళ్లు ఒకేసారి వచ్చాయి. క్రాసింగ్ పడ్డ సమయంలో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురుబడ్డాయి. దీంతో తీవ్ర గందరగోళం తలెత్తింది. సరైన సమయానికి లోకో పైలట్‌లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల.. రైళ్లు ఢీకొనకుండా పెను ప్రమాదం తప్పింది. అయితే చాలా మంది ప్రయాణికులు భయంతో ట్రైన్ దిగి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్థానికులు స్టేషన్ వద్ద భారీగా గుమిగూడారు.
05360 నెంబరు ట్రైన్ ఉదయం 8:24 గంటలకు బహ్రాయిచ్ వెళ్లడానికి రిసియా రైల్వే స్టేషన్ మూడో నెంబర్ ట్రాక్‌పై ఆగింది. అదే సమయంలో బహ్రాయిచ్ నుంచి వస్తున్న 05361 రైలు కూడా మూడో నెంబర్ ట్రాక్‌పైనే ఉంది. ట్రాక్‌పై వస్తున్న రైలును చూసిన 05360 రైలు లోకో పైలట్ ఇంజన్ లైట్ ఆన్ అప్రమత్తం చేశాడు. దీంతో అటువైపు నుంచి వస్తున్న మరో లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. దాదాపు గంటన్నర పాటు అదే ట్రాక్‌పై రెండు రైళ్లు నిలిచిపోయాయి. అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు చేశారు. ఆ తర్వాత బహ్రాయిచ్ నుంచి వచ్చిన రైలును లోకో పైలట్ వెనుకకు మళ్లించి.. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చారు.