జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటును(infiltration in kashmir) భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. సరిహద్దులో ముష్కర ఏరివేత ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని రక్షణ శాఖ అధికారి లెఫ్టినెంట్ కర్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.
"సోమవారం తెల్లవారుజామున కొందరు ఉగ్రవాదులు పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ దాటి దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అక్కడ పహారా కాస్తున్న ఆర్మీ జవాన్లు అప్రమత్తమై.. నిఘా వ్యవస్థ ద్వారా చొరబాటును గుర్తించారు. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను నిలువరించారు. ఒక ఉగ్రవాది మృతదేహాన్ని(ఏకే 47 ఆయుధంతో సహా) స్వాధీనం చేసుకున్నాం. మరొకరి మృతదేహం, అతడి ఏకే 47 ఆయుధం సరిహద్దుకు అవతల ఉండిపోయింది."
-లెఫ్టినెంట్ కర్నల్ దేవేందర్ ఆనంద్, ఆర్మీ ప్రతినిధి
సరిహద్దులో సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉందని లెఫ్టినెంట్ కర్నల్ ఆనంద్ స్పష్టం చేశారు. నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: సరిహద్దులో 400 మంది ఉగ్రవాదులు!