కేరళ కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో 18వ అంతర్జాతీయ టెలీమెడిసిన్ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. టెలీమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఈ సదస్సులో డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధులతో పాటు దేశం నలుమూలల నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రస్తుత, భవిష్యత్ టెలీమెడిసిన్ అవకాశాలు, గోప్యత హక్కు- చట్టపరమైన దృక్పథాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. కాన్ఫరెన్స్ మొదటి రోజున టెలీమెడిసిన్‌తో పాటు డిజిటల్ హెల్త్, ఐఓఎంటీతో పాటు టెలీ ఐసీయూ పర్యవేక్షణపై చర్చలు జరిగాయి. బెంగళూరు క్లౌడ్ ఫిజీషియన్ డాక్టర్ ధ్రువ్ జోషి 'స్మార్ట్ ఐసీయూలు- నేడు, రేపు' అనే అంశంపై ఒక పత్రాన్ని సమర్పించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన ఐసీయూ సేవలు అందించడంపైనా నిపుణులు సమాలోచనలు జరిపారు.
సదస్సులో డాక్టర్ సాయి ప్రవీణ్ హరనాథ్, డాక్టర్ ధ్రువ్ జోషి, డాక్టర్ రాజ్ రావల్, డాక్టర్ ప్రాచీ సాఠే పత్రాలను సమర్పించారు. చర్చల్లో డాక్టర్ సుదర్శన్‌తో పాటు డాక్టర్ ఫరూఖ్ వానీ మోడరేటర్లుగా ఉన్నారు. కేరళ ఐటీ కార్యదర్శి డాక్టర్ రథన్ ఖేల్కర్, అమృత హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్ నాయర్, టెలీమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ ప్రధాన్, టెలి మెడికాన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంజీ బినోయ్, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ కిమ్, డాక్టర్ మూర్తి రమీ సదస్సులో పాల్గొన్నారు. సదస్సు నేపథ్యంలో ప్రతినిధులకు శుభాకాంక్షలు చెబుతూ ఇస్రో ఛైర్మన్, ఎస్ సోమనాథ్ వీడియో సందేశం పంపారు.
ఇదీ చదవండి:శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు