ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలోని డౌర్ గ్రామంలో భారీగా వెలుగు చూసిన కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ ఊరిలో 170 మందికి వైరస్ సోకింది. కొన్ని రోజుల క్రితం ఊరిలో ఓ కార్యక్రమాన్ని గ్రామస్థులు నిర్వహించారు. అది వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు అధికారులు భావిస్తున్నారు. ఒకే గ్రామంలో అంతమందికి కొవిడ్ పాజిటివ్ రావటం వల్ల అప్రమత్తమయ్యారు.
కఠిన ఆంక్షలు
ఎక్కువ మందికి వైరస్ సోకిన నేపథ్యంలో ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఎవరూ బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. డౌర్లో 1500 కుటుంబాలు నివసిస్తున్నాయి. దాదాపు 4500 మంది జనాభా ఉన్నారు. వీరిలో 3000 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 170 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారులు తెలిపారు.
ఆ జాబితా సిద్ధం
ఆ ఊరుకు వచ్చి వెళ్లిన వారి జాబితాను సిద్ధం చేసిన అధికారులు.. వారందరినీ హోమ్ ఐసోలేషన్ చేశారు. జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు జిల్లా పాలనాధికారి. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా కనిపిస్తే.. వారిని జైల్లో పెట్టమని ఆదేశాలు జారీ చేశారు.
కారణమిదే!
తొలుత ఆ గ్రామ సర్పంచ్‌కు కరోనా సోకినట్లు తేలింది. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ ఊరు నుంచి కూలి పనుల కోసం రాయ్‌పుర్ వెళ్లొచ్చినవారు అధికంగానే ఉన్నారు. ఈ రెండు కారణాల వల్ల వైరస్ సోకినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: దేశంలో మరో 68 వేల మందికి కరోనా