మహారాష్ట్ర ఠాణెలో దారుణం జరిగింది. పోలీసులమని బెదిరించి 17ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేశారు. రేప్ చేస్తూ ఆ దారుణాన్ని వీడియో తీశారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం బాధితురాలు ఠక్రూలీ ఖాదీ బీచ్ ప్రాంతంలో తన ఫ్రెండ్‌తో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది. దారిలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరికి వచ్చారు. తాము పోలీసులు అని చెప్పి.. బాధితురాలిని, ఆమె ఫ్రెండ్‌ను కొట్టారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకడు.. ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రెండో వ్యక్తి బాధితురాలి ఫ్రెండ్‌ను దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టాడు. మళ్లీ తిరిగొచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
నిందితుల చెర నుంచి బయటపడ్డ బాధితురాలు.. ఘటన గురించి కుటుంబ సభ్యులకు వెల్లడించింది. వారితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న విశూనగర్ పోలీసులు.. ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు. ఓ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలో నిందితుల కదలికలు రికార్డయ్యాయని పోలీసులు తెలిపారు. వాటి ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ పండరినాథ్ భాలేరావ్ స్పష్టం చేశారు.
యువతి ఆత్మహత్య
రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం రాత్రి ఆమె బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. బందర్సింద్రి పోలీసుల కథనం ప్రకారం.. అజ్మీర్‌లోని యూనివర్సిటీలో యువతి ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చదువుతోంది. ప్రస్తుతం హాస్టల్లో ఉంటున్న ఆమె.. శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఘటనకు గల కారణాలు తెలియలేదు. దీనిపై యువతి తోటి స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. శవపరీక్ష నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
ఆరు గంటల్లో నిందితుడు అరెస్ట్..
ఐదేళ్ల బాలికపై ఓ బాలుడు అత్యాచారం చేశాడు. మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది. ఘటన జరిగిన ఆరు గంటల్లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ముంబయిలోని నాగపాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి సహాయార్థం.. అక్కడి పోలీసు అధికారులు రూ.1.10లక్షలు సేకరించి ఆమె కుటుంబానికి అందించారు. చిన్నారికి పదో తరగతి వరకు ఉచితంగా చదువు చెప్పిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: