Spurious liquor Bihar: బిహార్లో మరోమారు కల్తీ మద్యం కలకలం సృష్టించింది. లిక్కర్ బ్యాన్ నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా కల్తీ మద్యం విక్రయాలు ఆగటం లేదు. ఆ మద్యం సేవించి అమాయకులు బలవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజుల్లోనే కల్తీ మద్యం తాగి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఔరంగాబాద్ జిల్లాలో 11 మంది మరణించగా.. మధేపురా జిల్లాలో ఇద్దరు, గయాలో నలుగురు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఔరంగాబాద్ జిల్లాలో కల్తీ మద్యం వల్ల పలువురు మృతిచెందిన ఘటనపై ఎక్సైజ్ శాఖ మంత్రి సునీల్ కుమార్ స్పందించారు. కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించారని.. ఈ కేసుకు సంబంధం ఉన్న 11 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతుందని.. శవపరీక్షల నివేదక కోసం వేచి చూస్తున్నట్లు ఆయన తెలిపారు. కల్తీ మద్యం కేసుల్లో ఇప్పటివరకు 60 మంది పట్టుబడినట్లు సునీల్ కుమార్ పేర్కొన్నారు.
"జిల్లాలో కల్తీ మద్యం కేసు విచారణకు 10 బృందాలను నియమించాం. మా ప్రాథమిక విచారణలో పొరుగు రాష్ట్రమైన ఝార్ఖండ్ నుంచి కల్తీ మద్యం వచ్చినట్లు తేలింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎస్సైను సస్పెండ్ చేశాం. దీనిపై విచారణ కొనసాగుతోంది."
- సౌరభ్ జోర్వాల్, జిల్లా మెజిస్ట్రేట్
మధేపురా, గయా జిల్లాలో ఆరుగురు మృతి: మధేపురా జిల్లాలోని చౌసా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోసాయ్ గ్రామంలో కల్తీమద్యం తాగి అన్నదమ్ములు మరణించారు. సర్సా గ్రామంలో సుభోధ్ ఝా ఇంటిలో ఆదివారం రాత్రి ఓ పార్టీ జరిగింది. ఈ వేడుకకు హాజరైన అలోక్ ఝా తన సోదరుడుతో కలిసి మద్యం సేవించాడు. తర్వాత అస్వస్థతకు గురి కావడం వల్ల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
గయా జిల్లాలో కల్తీ మద్యం కారణంతో నలుగురు మరణించారు. మరో ఆరుగురికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిని మగధ్ వైద్య కళాశాలకు.. మరికొందరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్రంలో మద్య నిషేధాన్ని 2016లో అమలు చేసింది బిహార్ ప్రభుత్వం. మద్యం తయారీ, విక్రయం, సేవించటం నేరం. తొలినాళ్లలో నేరానికి పాల్పడితే ఆస్తుల స్వాధీనం, జీవిత ఖైదు శిక్షలు ఖరారు చేశారు. అయితే, 2018లో లిక్కర్ బ్యాన్ చట్టానికి సవరణలు చేశారు. శిక్షల్లో ఉపశమనం కల్పించారు. 2016 నుంచి ఇప్పటి వరకు 3లక్షలకుపైగా నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ఉగ్ర కాల్పుల్లో టీవీ నటి మృతి.. బంధువుకు గాయాలు..!