అసోం శాసనసభ మొదటి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేరచరిత్ర వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది. బరిలో నిలిచిన అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల ఆధారంగా ఒక నివేదికను తయారుచేసింది. తొలి దశలో పోటీ చేస్తున్న 264 మంది అభ్యర్థుల్లో 259 మంది నామినేషన్ పత్రాలను ఏడీఆర్ అధ్యయనం చేసింది.
ఈ నివేదిక వివరాలు..
- 41(16శాతం) మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నట్లు తెలిపారు.
- 34 మంది(13శాతం) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.
- ఐదుగురు అభ్యర్థులు తమపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నట్లు ప్రకటించారు. అందులో ఒకరిపై అత్యాచార కేసు ఉన్నట్లు తెలిపారు.
- ఇద్దరు అభ్యర్థులు తమపై హత్య కేసులు, నలుగురిపై హత్యాయత్నం కేసులున్నట్లు వెల్లడించారు.
పార్టీల వారీగా..
ప్రధాన పార్టీలలో.. కాంగ్రెస్ 23 శాతం మంది నేర చరితులకు అవకాశం కల్పించింది. అసోం జాతీయ పరిషత్ అభ్యర్థుల్లో 20 శాతం మందిపై కేసులున్నాయి. భాజపా నుంచి 8 శాతం మంది.. ఎన్‌సీపీ, ఏజీపీ, ఎస్‌యూసీఐ(సీ) పార్టీల నుంచి ఒక్కో అభ్యర్థి క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 19 శాతం మంది, ఏజీపీ అభ్యర్థుల్లో 8 శాతం, ఇతర పార్టీల నుంచి ఒక్కో అభ్యర్థిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.
కోటీశ్వరులు@101..
అసోం మొదటి దశ అభ్యర్థుల్లో 101 (39శాతం) మంది కోటీశ్వరులమని పేర్కొన్నారు. 97మంది(37శాతం) అభ్యర్థులు 5నుంచి, 12వ తరగతి వరకు చదువుకున్నట్లు తెలిపారు.
మహిళలు..
అసోం తొలిదశ ఎన్నికల్లో 10 శాతం(25మంది) మహిళలు పోటీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: అసోం తొలిదశ ఎన్నికల బరిలో 267 మంది