Car made by student: కేరళ అలప్పుజలోని మారుమూల గ్రామం వలవనాడ్‌కు చెందిన 15 ఏళ్ల అగ్నివేష్‌కు స్పోర్ట్స్ రేసింగ్ కార్లంటే మక్కువ ఎక్కువ. ఇతను కలవూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. స్పోర్ట్స్ రేసింగ్ కార్లంటే ఇష్టం ఉన్నా కొనే స్తోమత లేదు. ఎలాగైన కారు తయారు చేయాలని తలిచాడు. అనుకున్నదే తడవుగా యూట్యూబ్‌లో వీడియోలు చూసి నైపుణ్యం పొందాడు. తన తండ్రి పాత స్కూటర్ ఇంజిన్‌ను.. కారు తయారీ కోసం ఉపయోగించాడు. అందుబాటులో ఉన్న వస్తువులతో.. సొంతంగా మూడు టైర్ల స్పోర్ట్స్ రేసింగ్ కారును తీర్చిదిద్దాడు. తన కలను సాకారం చేసుకున్నాడు.
వంద సీసీ ఇంజిన్ గల ఈ కారు లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీంట్లో ఒకరు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. వస్తువుల సేకరణ, ఫిట్టింగ్ అన్నీ అగ్నివేషే స్వయంగా చేశాడు. కారును చూసేందుకు గ్రామస్థులు అగ్నివేష్ ఇంటికి తరలివస్తున్నారు. సొంతంగా తయారు చేసిన కారులో అగ్నివేష్ ఊరంతా చక్కర్లు కొడుతున్నాడు.
అగ్నివేష్ ఇంతకుముందు కూడా వాహనాలను తయారు చేశాడు. వ్యవసాయ అవసరాల కోసం రెండు వాహనాలను రూపొందించాడు. అగ్నివేష్ తండ్రి సత్యప్రకాష్ స్థానిక పరిపాలన విభాగంలో, తల్లి సుధ GST విభాగంలో పనిచేస్తున్నారు. కుమారుడి ఆవిష్కరణల పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: కన్నవాళ్లు లేకున్నా సడలని సంకల్పం- 'డాక్టర్' కల సాకారం!