14 Thousand Judgements In Hindi : మాతృభాష పట్ల ఉన్న ప్రేమతో ఓ న్యాయమూర్తి ఏకంగా 14,232 తీర్పులను హిందీలో వెలువరించారు. దీంతో ఆయన ప్రపంచ రికార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఆయనే ఉత్తర్ప్రదేశ్ అలహాబాద్ హైకోర్టు జస్టిస్ డాక్టర్ గౌతమ్ చౌదరీ.
సాధారణంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో తీర్పులను దాదాపుగా ఆంగ్లంలోనే వెలువరిస్తారు న్యాయమూర్తులు. అయితే అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ డా.గౌతమ్ చౌదరీ మాత్రం తన మాతృభాషపై ఉన్న మమకారంతో దాదాపు నాలుగేళ్లుగా కేవలం హిందీలోనే తీర్పులను ఇస్తున్నారు. తన మాతృభాషకు ఇచ్చిన ప్రాధాన్యం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు జస్టిస్ గౌతమ్ చౌదరీ.
హిందీలో 14,232 తీర్పులు.. ప్రపంచ రికార్డు..!
2019 డిసెంబర్ 12న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైనప్పటి నుంచి ఇప్పటి వరకు (2023 అక్టోబర్ 8) దాదాపు నాలుగేళ్లలో ఏకంగా 14,232 తీర్పులను కేవలం హిందీలోనే వెలువరించారు జస్టిస్ గౌతమ్ చౌదరీ. ప్రపంచ రికార్డు ఘనత సాధించడంలో తన తండ్రి ప్రోత్సాహం ఉందని తెలిపారు జస్టిస్ గౌతమ్ చౌదరీ. సామాన్యులకు సైతం కోర్టు తీర్పులు సులువుగా అర్థం కావాలనే ఆలోచనతో మాతృభాషలో తీర్పులతో గౌతమ్ చౌదరీ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు సైతం అభినందిస్తున్నారు. అంతేకాకుండా ఆయన మార్గంలోనే తాము కూడా మాతృభాషలో తీర్పులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు.
ఆంగ్ల మాధ్యమంలో విద్య.. అయినా సరే..
జస్టిస్ గౌతమ్ చౌదరీ పూర్తిగా తన విద్యాభ్యాసాన్ని ఆంగ్ల మాధ్యమంలోనే పూర్తిచేశారు. అయినప్పటికీ మాతృభాష అయిన హిందీని అత్యంత అమీతంగా ప్రేమిస్తానని చెబుతున్నారు. అలాగని ఇతర భాషలను తక్కువ చేయనని.. మిగతా భాషలంటే కూడా తనకు గౌరవమని.. కానీ, హిందీ అంటే కాస్త ఎక్కువ ఇష్టమని చెప్పారు.
తీర్పులే కాదు.. అవి కూడా హిందీలోనే..
తీర్పులే కాదు.. మధ్యంతర ఉత్తర్వులను కూడా హిందీలో జారీ చేస్తారు జస్టిస్ గౌతమ్ చౌదరీ. బెయిల్ పిటిషన్లు, రివిజన్ పిటిషన్లు సహా అనేక ముఖ్యమైన విషయాలను కూడా పూర్తిగా హిందీలోనే తెలియజేస్తారు. ఈయన ప్రేరణతోనే ప్రస్తుతం అదే హైకోర్టులోని ఇతర న్యాయమూర్తులు కూడా హిందీలో తీర్పులు చెప్పడం ప్రారంభించారు. జస్టిస్ డాక్టర్ గౌతమ్ చౌదరీ హిందీలో ఇస్తున్న తీర్పుల విధానాన్ని సామాన్య ప్రజలు కూడా అభినందిస్తున్నారు.
"మన మాతృభాషను మర్చిపోవద్దని నా తండ్రి నాకు చెప్పారు. నా జీవితంలో హిందీపై ఇంతలా మమకారం పెంచుకోవడానికి ఇద్దరు కారణం. ఒకరు నా తండ్రి, మరొకరు నా భార్య. వీరిద్దరూ నన్ను ఈ విషయంలో ఎప్పుడూ ప్రోత్సహించేవారు. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో హిందీ సబ్జెక్టులో నాకు తక్కువ మార్కులు వచ్చాయి. అప్పుడు నా తండ్రి నాకు ఒక్కటే చెప్పారు. 'ఆంగ్లంను నేర్చుకోండి. కానీ మన మాతృభాషైన హిందీని మాత్రం మరవకండి. తక్కువ అంచనా వేయకండి' అని చెప్పారు."
- జస్టిస్ గౌతమ్ చౌదరీ , అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గౌతమ్ చౌదరీ.
Teacher Slapped Student 35 Times : హోంవర్క్ చేయలేదని బాలికపై టీచర్ దారుణం.. 35సార్లు..