మహారాష్ట్రలోని ఠాణె జిల్లా పరిధిలోని ఓ గోదాములో పోలీసులు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గురునాథ్ మహత్రేకు చెందిన ఆ గోదాములో 12,000 జిలెటిన్ స్టిక్స్, 3,000లకు పైగా డిటోనేటర్లు లభ్యమయ్యాయి. నిందితుడు మహత్రేను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడు అక్రమంగా పేలుడు పదార్థాలను గోదాములో నిల్వ ఉంచాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఠాణె క్రైం బ్రాంచ్ అధికారులు భివండీ పట్టణ సమీపంలోని కార్వాలీ గ్రామానికి చెందిన నిందితుడి గోదాముపై మంగళవారం దాడులు జరిపారు. నిందితుడు నిర్మాణ, మైనింగ్ వ్యాపారాలు చేస్తుండటం చేత ఈ పేలుడు పదార్థాలను నిల్వ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే అతను ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈనెల 22 వరకు నిందితుడు పోలీస్ కస్టడీలో ఉంటాడని సమాచారం.
ఇదీ చదవండి : 'రాష్ట్రాలు, యూటీల వద్ద 1.94 కోట్ల టీకాలు'