మహారాష్ట్ర శాసనసభ నుంచి 12 మంది భాజపా ఎమ్మెల్యేలు ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. స్పీకర్ ఛాంబర్లోని ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌తో అనుచితంగా ప్రవర్తించినందుకు వీరిపై వేటు పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలన్న తీర్మానాన్ని రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనిల్ పరాబ్.. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. దీంతో 12 మందిపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. ముంబయి, నాగ్‌పుర్‌లలో ఉన్న శాసనసభ పరిసరాల్లోకి వీరికి అనుమతి ఉండదని అనిల్ పరాబ్ పేర్కొన్నారు.
అయితే, ప్రిసైడింగ్ అధికారితో అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలను విపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఖండించారు. ఓబీసీ కోటా విషయంలో ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టినందుకే ఇలా కక్షసాధింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. సభా కార్యకలాపాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
"ప్రిసైడింగ్ అధికారితో అనుచితంగా వ్యవహరించింది భాజపా సభ్యులు కాదు. శివసేన సభ్యుడే ఆయనపై అసభ్య పదజాలం ఉపయోగించారు. మా ఎమ్మెల్యేలను స్పీకర్ ఛాంబర్ నుంచి నేను బయటకు తీసుకొచ్చాను. ఆయన క్షమాపణలు చెప్పారు. ఇది అంతటితో ముగిసిపోయింది."
-దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర మాజీ సీఎం
వివాదం ఇలా...
స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం సమాచారం సిద్ధం చేసేందుకు 2011 నాటికి జనాభా గణాంకాలను రాష్ట్ర బీసీ కమిషన్‌కు అందించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం తలెత్తింది. కొందరు భాజపా నేతలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అక్కడ ఉన్న ప్రిసైడింగ్ అధికారితో వాదనకు దిగారు. దీంతో తొలుత సభ వాయిదా పడింది. ఆ తర్వాత సభ మళ్లీ భేటీ అయినప్పటికీ.. కార్యకలాపాలు మాత్రం సజావుగా సాగలేదు. మరో మూడుసార్లు సెషన్ వాయిదా వేయాల్సి వచ్చింది.
అనంతరం సభ సమావేశమైన తర్వాత.. స్పీకర్ కుర్చీలో ఉన్న జాదవ్.. ఘటనపై వివరణ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల పట్ల తాను దురుసుగా ప్రవర్తించానని వచ్చిన ఆరోపణను కొట్టిపారేశారు. ఈ ఆరోపణ నిజమని తేలితే ఏ శిక్ష విధించినా తనకు అభ్యంతరం లేదని అన్నారు.
ఇదీ చదవండి: మోదీ స్ఫూర్తితో 'చాయ్‌వాలా'గా ఇంజినీర్!