బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ బాలిక ఒకరోజు కలెక్టర్‌గా(one day collector) విధులు నిర్వహించి తన కలను సాకారం చేసుకుంది. చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలన్న 11 ఏళ్ల ఫ్లోరా అసోడియా కలను మేక్ ఏ విష్ ఫౌండేషన్ నెరవేర్చింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో(Ahmedabad news) ఫ్లోరా అనే బాలిక బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. శస్త్ర చికిత్స చేసిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీని గురించి మేక్ ఏ విష్ ఫౌండేషన్.. ఆ జిల్లా కలెక్టర్‌కు తెలియజేసింది. ఫలింతగా అందుకు అంగీకరించిన కలెక్టర్ సందీప్ సింగ్లే.. ఆ బాలికకు ఒక రోజంతా విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు.
"గాంధీనగర్‌కు చెందిన ఫ్లోరా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. గతనెలలో శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అయితే ఆ బాలిక కలెక్టర్ కావాలనుకుంటుందని మేక్ ఏ విష్ ఫౌండేన్ నుంచి మాకు సందేశం వచ్చింది. దీంతో ఆమెను ఒకరోజు కలెక్టర్‌గా చేయమని ఫ్లోరా తల్లిదండ్రులను అభ్యర్థించాం. కానీ శస్త్రచికిత్స తర్వాత ఆమె పరిస్థితి క్షీణించడం వల్ల వారు విముఖత వ్యక్తం చేశారు. అయితే చివరకు వారిని ఒప్పించి ఆమె కలను నెరవేర్చడంలో విజయం సాధించాం."
- సందీప్ సంగ్లే, అహ్మదాబాద్ కలెక్టర్
ఫ్లోరా త్వరగా కోలుకుని భవిష్యత్తులో కలెక్టర్ కావాలని ఉన్నతాధికారులు అభిలాషించారు. అలాగే ఈ నెల 25న ఫ్లోరా పుట్టినరోజు ఘనంగా నిర్వహిస్తామని సంగ్లే పేర్కొన్నారు.
కుమార్తె కల నెరవేర్చినందుకు ఫ్లోరా తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. అందుకు సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
"ఫ్లోరా ఏడో తరగతి చదవుతోంది. చురకైన విద్యార్థిని. కలెక్టర్ కావాలని కలలు కంటోంది. అయితే గత ఏడు నెలలుగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. కానీ సందీప్ సార్, మేక్ ఏ విష్ ఫౌండేషన్ నా కుమార్తె కలను సాకారం చేశారు. ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- మరో 30వేల మందికి వైరస్