లాక్డౌన్లో అందివచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనలోని ప్రతిభకు పదునుపెట్టాడు ఓ విద్యార్థి. వినూత్నంగా ఆలోచించి ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశాడు కర్ణాటక బెల్గాం జిల్లా నిప్పని టౌన్‌కు చెందిన ప్రథమేశ్. వ్యర్థ పదార్థాలు, పాత బైక్ విడి భాగాలతో ఈ-బైక్‌ను రూపొందించాడు.
ప్రథమేశ్ 10వ తరగతి చదువుతున్నాడు. తన కుటుంబం సహాయంతో కొన్ని పాత బైక్ పరికరాలను సమకూర్చుకున్నాడు. 48 వాట్ల బ్యాటరీ, 48 వాట్ల మోటార్, 750 వాట్ల మోటార్, బ్యాటరీ కంట్రోల్ మెషన్.. పరికరాలతో దీనిని తయారు చేశాడు. కేవలం రూ.25 వేల ఖర్చుతోనే పూర్తి చేశాడు.
పెట్రోల్ భారం పడకుండా
ప్రస్తుతం ఈ బైక్‌ను రోజువారీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడు ప్రథమేశ్. దేశంలో ఎప్పటికప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతుంటాయి కాబట్టి.. వాటి భారం తనపై పడకుండా ఇలా ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించానని చెప్పాడు.
ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే.. దాదాపు 35 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈ బైక్ నడుస్తుంది. రివర్స్ దిశలోనూ ఈ బైక్ నడుస్తుంది.
ప్రథమేశ్ తండ్రి ఓ ఎలక్ట్రిక్ సంస్థలో ఉద్యోగి. లాక్డౌన్లో సమయాన్ని వృథా చేయకుండా తన కుమారుడు ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : వావ్: అగ్గిపుల్లలతో అందమైన 'రేడియో'