వాహనాలు, విద్యుద్దీపాలు లేని కాలంలో.. కొండప్రాంతంలోని ఓ గ్రామంలోని మహిళలందరికీ ప్రసవాల సమయంలో పెద్దదిక్కైంది ఓ పెద్దావిడ. కేరళ తిరువనంతపురంలోని వెల్లారదా ఆ ఊరు. 103 ఏళ్ల నీసమ్మ ఆ పెద్దావిడ. ఆ ఊర్లోని ప్రతి మహిళకూ ప్రసవం చేసింది నీసమ్మే. ఈ వయసులోనూ ఎలాంటి వ్యాధులూ లేకుండా, అంతే హుషారుగా కనిపిస్తుంది నీసమ్మ.
"వెల్లారదా వాసులు ప్రసవాలకు, ప్రసవానంతర కార్యక్రమాలకు ఈ మంత్రసాని నీసమ్మ మీదే ఆధారపడతారు. అడవి జంతువులు ఇక్కడ తిరుగుతుండే సమయం నుంచే నీసమ్మ ఇక్కడ ఉంటోంది. ఈ చుట్టుపక్కల ఆసుపత్రులు ఉండేవి కావట. అప్పటినుంచే ఒంటరిగానే ప్రసవాలు చేయడం ప్రారంభించింది నీసమ్మ."
- గీత, స్థానికురాలు
5వేలకు పైగా ప్రసవాలు..
ప్రస్తుతం ప్రసవాల కోసం ఆసుపత్రులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి. ప్రసవానికి మునుపు, అనంతరం కూడా ఆసుపత్రుల్లోనే ఉంటున్నారు. ఈ అన్ని రోజుల సేవల కోసం, ప్రైవేటు ఆసుపత్రులు ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొస్తున్నాయి. వైద్యరంగంలో ఎలాంటి శిక్షణా లేకుండానే 5వేలకు పైగా ప్రసవాలు చేసింది నీసమ్మ. కొన్ని దశాబ్దాల క్రితం అడవి జంతువులు ఊర్లలో తిరిగే సమయంలోనూ ఎలాంటి భయం లేకుండా అవసరమున్న చోటికి వెళ్లి సేవలు అందించింది నీసమ్మ. చివరగా 1979లో ప్రసవం జరిపించింది.
"నేను అమ్మ మనవరాలిని. నా రెండు కాన్పులూ అమ్మమ్మే చేసింది. ప్రసవాలు, ఆ తరువాతి సంరక్షణ కోసం ఈ చుట్టుపక్కల ఎన్నో చోట్లకు వెళ్లిందామె."
- బేబీ, నీసమ్మ మనవరాలు
ఇదీ చదవండి: కళ్లు లేకపోయినా 40 ఏళ్లుగా మిల్లు నడుపుతూ..
ప్రభుత్వ ఉద్యోగాన్ని నిరాకరించి..
వెల్లారదా, నిలమమూడు, చెరియకొల్లా, పన్నిమలా, కరిప్పువలి, కడుక్క, కొంబరం, గణపతికళ్లు, కూథలి, అరత్తుకులి గ్రామాల్లో ఎన్నో కుటుంబాలకు సేవ చేసింది నీసమ్మ. నీసమ్మ పనితీరును గుర్తించిన ప్రభుత్వం.. ఆమెకు ఉద్యోగం ఇస్తామని పిలిచింది. కానీ, కుటుంబ బాధ్యతలు వదలలేక ఆ ఉద్యోగంలో చేరలేదు.
"ఎమర్జెన్సీ అని నన్ను పిలవడానికి ప్రజలు నా ఇంటికొచ్చేవాళ్లు. పగలైనా, రాత్రైనా ప్రసవాలు చేసేందుకు వెళ్లేదాన్ని. వెళ్లడానికి వీల్లేని ప్రాంతాలకు కూడా నేను వెళ్లాను."
- నీసమ్మ, 103 ఏళ్ల మంత్రసాని
నీసమ్మకు 8 మంది పిల్లలు, 18 మంది మనవలు, మనవరాళ్లు. తన తర్వాత నాలుగు తరాలను చూసింది. చిన్నపాటి దృష్టి, వినికిడి లోపాలు, వయసు రీత్యా వచ్చే నీరసం తప్ప.. నీసమ్మకు పెద్ద అనారోగ్యాలేవీ లేవు. ప్రసవాలు చేయడంలో దశాబ్దాల అనుభవం గడించిన నీసమ్మను.. రాష్ట్ర లైబ్రరీ కౌన్సిల్ సహా ఎన్నో సంస్థలు సత్కరించాయి.
ఇదీ చదవండి: ఆటోను 100మీటర్లు లాగిన ఆరేళ్ల చిన్నారి