103 Year Old Woman Runner : 103 ఏళ్ల వయసులో పరుగు పందెంలో పాల్గొనడానికి సిద్ధమైంది ఓ వృద్ధురాలు. అందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీ వేదికగా జరుగనున్న ఎంపీ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి తన పేరును నమోదు చేయించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన 'ఖేలేగా భారత్ తో ఖిలేగా భారత్' అనే నినాదం ప్రేరణతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో పాటు ఎక్కువ మంది ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. అప్పుడే క్రీడల్లో కూడా భారత్ సూపర్ పవర్ అవుతుందని చెప్పింది. ఈ వయసులో కూడా క్రీడల పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న ఈ వృద్ధురాలి గురించి తెలుసుకుందాం.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పర్మందాపుర్ ప్రాంతంలో కళావతి అనే 103 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తోంది. కళావతికి పదేళ్ల వయసులోనే పెళ్లి చేశారు. ఆ తర్వాత పిల్లలు పుట్టడం లేదన్న కారణంతో కళావతిని ఆమె భర్త వదిలేశాడు. దీంతో తన పుట్టింటికి వచ్చి.. తన మేనళ్లుడు డాక్టర్ అశోక్ కుమార్ ఇంట్లో జీవనం సాగిస్తోంది. ప్రతిరోజు బలవర్ధక ఆహారం తీసుకుంటుంది. ఆహారంపై నియంత్రణ కూడా పాటిస్తుంది. అంతేకాకుండా ప్రతి రోజు 2- 3 కిలో మీటర్ల నడకను తన దినచర్యలో భాగం చేసుకుంది. అయితే కళావతికి చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి ఉంది. తన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ క్రీడా పోటీలు జరిగినా అక్కడికి వెళ్లేది. కేరింతలు కొడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేది.
"క్రీడలు శారీరకంగా, మానసికంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క్రమశిక్షణతో మెలిగేలా చేస్తాయి. ఈ ఎంపీ క్రీడా పోటీల ద్వారా గ్రామాల నుంచి నగరాల వరకు ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. ఇలాంటి పోటీల్లో ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనాలి. ప్రజలకు ఓ సందేశం ఇవ్వడం కోసం నేను ఈ పోటీల్లో పాల్గొంటున్నాను."
-- కళవాతి, 103 ఏళ్ల వృద్ధురాలు
కాశీలో జరగనున్న ఎంపీ క్రీడా పోటీల్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునేవారు కచ్చితంగా ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
108 ఏళ్ల ఏజ్‌లో తొలిసారి సంతకం.. 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' కమల!