ఇటీవలే 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సర్దార్ కౌర్ అనే బామ్మ.. కరోనా మహమ్మారిని జయించారు. తన కుటుంబం వైరస్ నుంచి కోలుకునేలా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. వైరస్ పై పోరాటం చేస్తోన్న వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
బాగ్పత్కు చెందిన సర్దార్ కౌర్.. ఓటేయడానికి తన స్వగ్రామానికి వెళ్లిన సమయంలో కరోనా బారినపడ్డారు. ఆమె నుంచి కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని కౌర్ కుమారుడు దృష్టద్యుమ్య సింగ్ తెలిపారు.
అయితే కొవిడ్ సోకిందని తెలిసినప్పుడు బాధపడినప్పటికీ.. కుటుంబసభ్యులెవ్వరూ నమ్మకం కోల్పోలేదు. సర్దార్ కౌర్ సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం కరోనాపై పోరాటానికి ప్రేరేపించాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
"చురుకైన జీవనశైలి, విశ్వాసం, సానుకూల ధోరణితో ఈ పోరాటంలో గెలిచాను. చికిత్స సమయంలో ఎట్టి పరిస్థితుల్లో బలహీనంగా ఉండటానికి నన్ను నేను అనుమతించుకోలేదు. నా కుటుంబ సభ్యులకు కూడా అదే ధైర్యం చెప్పా." అని సర్దార్ కౌర్ చెప్పారు.
మే 15న వచ్చిన రిపోర్టులో సర్దార్ కౌర్ సహా కుటుంబం మొత్తానికి నెగిటివ్ గా తేలింది.
ఇదీ చూడండి: పల్లెలపై కొవిడ్ పడగ.. వేలల్లో సిబ్బంది కొరత