Vaccination: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అర్హులందరికీ తొలి డోసు అందించగా రెండో డోసు పంపిణీ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో గోవా ముందడుగు వేసింది. రాష్ట్రంలో 100 శాతం అర్హులకు పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) వ్యాక్సిన్ అందించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే, సాధారణ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కొవిడ్ వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపింది.
"రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టీకాకు అర్హులైన వారందరికీ గతేడాది సెప్టెంబర్‌లోనే ఒక డోసు అందించాం. వ్యాక్సిన్‌కు అర్హులైన వారు రాష్ట్రంలో మొత్తం 11.66లక్షల మంది ఉండగా వారందరికీ రెండు డోసుల్లో పంపిణీ చేశాం. అయినప్పటికీ గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారికి వ్యాక్సిన్ అందిస్తాం. భారీ వర్షాలు, తుపాను సమయంలోనూ ఎలాంటి ఆటంకం లేకుండా వ్యాక్సినేషన్‌ను కొనసాగించాం. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు" అని గోవా స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ రాజేంద్ర బోర్కర్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 173 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అర్హులైన వారిలో 96శాతం మందికి తొలిడోసు అందించగా.. దాదాపు 75 శాతానికిపైగా రెండు డోసులు తీసుకున్నారు. మరో కోటి 79 లక్షల మందికి మూడో డోసును అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చూడండి: 'ఆ ఆంక్షలు ఎత్తేయండి!'.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన