దేశంలో ఇటీవల అనతికాలంలోనే కొవిడ్ కేసులు ఐదు రెట్లు పెరిగాయని, పరిస్థితి తీవ్రంగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. మాస్క్‌లు ముక్కు, నోటిపైనే ఉండాలని సూచించింది. ప్రభుత్వాలు కూడా తక్షణ చర్యలు చేపట్టి పరిస్థితి చేజారకుండా చూసుకోవాలని సూచించింది. దేశంలో వైరస్ ఉద్ధృతిపై ఆరోగ్యశాఖ అధికారులు నేడు మీడియాతో మాట్లాడారు.
‘‘గతేడాది జులై నుంచి కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. సెప్టెంబరులో వైరస్ మరింత తీవ్రమైంది. ఆ తర్వాత నుంచి కొవిడ్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య నుంచి కేసులు మళ్లీ పెరిగాయి. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దానివల్ల యావత్ దేశం ప్రమాదంలో పడుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’’ అని నీతి ఆయోగ్(ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. అయితే ప్రజలు కూడా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు పెంచాలి, కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి వైరస్ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచాలని పేర్కొంది.
10 జిల్లాల్లో అత్యధిక యాక్టివ్‌కేసులు
కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య మళ్లీ 5లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,40,720 యాక్టివ్ కేసులుండగా.. క్రియాశీల రేటు 4.47శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా 10 జిల్లాలో అత్యధిక యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో ఎనిమిది జిల్లాలు ఒక్క మహారాష్ట్రవే కావడం గమనార్హం. 59వేల పైచిలుకు క్రియాశీల కేసులతో పుణె అగ్రస్థానంలో ఉండగా.. ముంబయి, నాగ్‌పూర్, ఠాణె, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, నాందేడ్, దిల్లీ, అహ్మద్‌నగర్‌లో అత్యధిక యాక్టివ్ కేసులున్నాయి.
పంజాబ్ ప్రభుత్వం అలసత్వం
పంజాబ్‌లో కేసులు పెరగడానికి అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అక్కడ ప్రజలకు కొవిడ్ పరీక్షలు చేయడం లేదని, వైరస్ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ‘‘ఫిబ్రవరిలో పంజాబ్‌లో సగటు రోజువారీ కేసులు 240గా ఉండేవి. ఇప్పుడు రోజుకు 2,700 కేసులు వస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం సరిగ్గా కాంటాక్ట్ ట్రేసింగ్ చేయకపోవడం వల్లే కేసులు పెరిగాయి’’అని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు.
ఏప్రిల్ 1 నుంచి వారికి టీకాలు..
ఏప్రిల్ ఒకటో తేది నుంచి 45ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు వేసుకునేందుకు అర్హులేనని రాజేశ్ భూషణ్ వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం కొవిన్ యాప్‌లో ముందస్తు నమోదు చేయించుకోవాలని సూచించారు. లేదంటే ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటల తర్వాత నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా టీకా పొందొచ్చని తెలిపారు. టీకా కేంద్రానికి వెళ్లేప్పుడు ఆధార్‌కార్డు/ఓటర్ ఐడీతో పాటు బ్యాంక్ పాస్‌బుక్, పాస్ట్‌పోర్టు లేదా రేషన్ కార్డు కూడా తీసుకెళ్లాలని చెప్పారు.
తెలంగాణ టాప్..
ప్రైవేటు కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ 48. 39 శాతంతో అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది. ఆ తర్వాత స్థానంలో 43.11 శాతంతో దిల్లీ ఉంది.
ఇదీ చదవండి : నందిగ్రామ్ రణంలో అగ్రనేతల ఆఖరి పంచ్!