మధ్యప్రదేశ్ బాలాఘాట్‌లో నక్సలైట్ల పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 11మందిని అరెస్ట్ చేయగా.. వీరి వద్ద నుంచి సుమారు రూ.10కోట్లను స్వాధీనం చేసుకున్నారు. నంబర్టోలా గ్రామానికి చెందిన నిషాబాయి అనే మహిళకు డబ్బుల ఆశ చూపి.. ఆమె ఇంట్లో ఈ నగదును పాతిపెట్టారు. అంతకుముందు అరెస్టైన అజయ్, మహేశ్‌ను విచారించగా.. ఇంటి కింద భూమిలో నగదు పాతిపెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. వారికి ఆశ్రయం ఇచ్చినందుకు గాను మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు నక్సలైట్లతో సంబంధం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు.
ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య: మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలో దారుణం జరిగింది. ముగ్గురు గిరిజన అక్కాచెల్లెళ్లు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జవర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటాఘాట్ గ్రామానికి చెందిన జామ్సింగ్కు ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. ఆయన కొన్నేళ్ల కింద మరణించగా.. తల్లితో కలిసి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబంలో సమస్యలు అధికమవడం వల్ల ముగ్గురు అక్కాచెల్లెలు ఉరివేసుకుని చనిపోయారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులను సోను (23), సావిత్రి (21), లలిత (19)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని.. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.
ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం.. వీడియో తీసిన యువకులు: తమిళనాడు తిరువళ్లూరులో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 75 ఏళ్ల వృద్ధుడు. దీనిని మరో యువకుడు వీడియో తీసి షేర్ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీడియోను షేర్ చేసిన ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు.
మరోవైపు ఆ బాలిక పాముకాటుతో జులై 24న మరణించింది. అయితే ఇప్పుడు ఆమె మరణంపై సైతం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలిక తండ్రి మరణించగా.. తల్లి వేరుగా ఉంటుంది. దీంతో బాలిక బంధువుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో యువకుడు చాటుగా చిత్రీకరించాడు. ఈ వీడియో చూపించి వృద్ధుడు వద్ద నుంచి డబ్బులు సైతం వసూలు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. ఆగస్టు 5 వరకు కస్టడీ విధించింది.
హనీ ట్రాప్‌లో ఆర్మీ జవాన్.. పాకిస్థాన్‌కు కీలక సమాచారం: పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న ఆర్మీ జవాన్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు మహిళా ఏజెంట్ల వలలో పడిన ఓ ఆర్మీ జవాన్.. డబ్బుకు ఆశపడి సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో వారికి చేరవేశాడు.
బంగాల్‌కు చెందిన 24 ఏళ్ల శాంతిమోయ్ రాణా.. మార్చి 2018 నుంచి ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అంకిత, నిషా అనే పేరుతో ఇద్దరు పాకిస్థాన్ యువతులు ఆర్మీలో నర్సులుగా పనిచేస్తున్నామని నమ్మించి.. రాణాను హని ట్రాప్‌లో పడేశారు. ఆ తర్వాత భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని అడిగారు. వారి వలలో పడిన రాణా.. కీలకమైన పత్రాలను సోషల్ మీడియా ద్వారా చేరవేశాడు. దీంతో అతడిపై అధికార రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదుచేసిన అధికారులు.. అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఈ కేసు విచారణకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.
ఉమేశ్ కొల్హే నిందితులపై జైలులో దాడి: సంచలనం సృష్టించిన ఉమేశ్ కొల్హే హత్య కేసులో నిందితుడు షారుఖ్ పఠాన్‌పై తోటి ఖైదీలు దాడి చేశారు. ముంబయి అర్థర్ రోడ్ జైలులోని రెండో నంబర్ బ్యారక్‌లో ఉంటున్న అతడిపై.. మరో ఐదుగురు ఖైదీలు దాడి చేశారు.
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూప్‌లో పోస్టును ఫార్వర్డ్ చేసిన మెడికల్ షాపు యజమాని ఉమేశ్ కొల్హే ను(కెమిస్ట్) ఏడుగురు దుండగులు దారుణంగా చంపారు. ఈ కేసును విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. ఇర్ఫాన్‌ఖాన్(32), షేక్ ఇబ్రహిం(22), షారుఖ్ పఠాన్(25), షేక్ తస్లిమ్(24) షోయబ్ ఖాన్(22), అదిల్ రషీద్(22), బహుదుర్ ఖాన్(44)ను అరెస్ట్ చేసింది. మొదట ఏడు రోజులు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. కస్టడీ ముగిసినందున కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 5 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
సుప్రీం న్యాయవాదికి బెదిరింపులు: ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది వినీత్ జిందాల్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. దుండగులు బెదిరింపు లేఖను పంపిచడం వల్ల ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని దిల్లీ పోలీసులను డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి ఇంటికి సమీపంలో బెదిరింపు లేఖ లభించిందని వినీత్ జిందాల్ చెప్పారు.
గతంలో ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థలు జిందాల్‌కు బెదిరింపు సందేశాలు పంపాయి. వినీత్ జిందాల్ వివాదాస్పద కాళీ మాత పోస్టర్ విడుదల చేసిన దర్శకులపై గతంలో ఫిర్యాదు చేశారు. "వినీత్ జిందాల్ త్వరలో నీ శరీరం నుంచి తల వేరవుతుంది" అని లేఖలో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: బంగాల్‌లోనూ 'ఆపరేషన్ శిందే!'.. భాజపాతో టచ్‌లో 38మంది టీఎంసీ ఎమ్మెల్యేలు!
CCTV Video: స్పీడ్‌గా వచ్చి బైక్ ఢీ.. 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డ మహిళ