YSRCP Leaders canal kabza: తారా స్థాయికి వైఎస్సార్సీపీ ఆగడాలు.. ఏకంగా కాలువనే..! - తిరుపతి జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
YSRCP Leaders canal kabza: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతల అవినీతి అక్రమాలు మితిమీరుతున్నాయి. రాజకీయ బలం, అధికారుల అండదండలతో ఖాళీ స్థలాలు, కాలువలు, గుట్టలు, శ్మశానాలు ఇలా అన్నింటినీ ఆక్రమించేస్తున్నారు. దీంతో సామాన్యుల జీవనాధారం కష్టతరంగా మారుతోంది. జిల్లాలోని తొండమనాడు చెరువు నుంచి స్వర్ణముఖి నది వరకు సుమారు 10 కిలోమీటర్లు పొడవు విస్తరించిన నక్కల కాలువతో 350 ఎకరాలకు పైగా పంటలకు సాగునీరు అందుతుంది. 30 అడుగుల ఈ కాలువపై స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి బంధువు కన్నేశాడు. ఈ క్రమంలో అతడు నూతనంగా ఏర్పాటు చేయదలచిన విల్లా కోసం కాలువను పూడ్చేసి ఏకంగా పొలాల మధ్య రోడ్డు ఏర్పాటు చేశాడు. కాలువ రూపురేఖలను మార్చేసి ఏడు అడుగుల వెడల్పుల వరకు కుదించేశాడు. దీంతో రానున్న వర్షాకాలంలో చెరువు నుంచి వచ్చే నీటితో అమ్మపాలెం, చెర్లోపల్లి, మిట్ట కండ్రిగ, బృందమ్మ కాలనీ పరిసర ప్రాంతాల ఆయకట్టు పంటలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానిక రైతులు వాపోతున్నారు. రాజకీయ నేతలు ఏర్పాటు చేయనున్న లే అవుట్ కోసం పంట కాలువలను పూడ్చటం, అనధికారికంగా ప్రభుత్వ నిధులతో కల్వర్ట్ నిర్మించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి జలవనరుల శాఖ రూ.3.5కోట్ల నిధులు కేటాయించినట్లు సమాచారం. అయితే పంట కాలువ ఆక్రమించడంపై మాకు సమాచారం లేదని అధికారులు వంతు పలకడం గమనార్హం.