Selfie Suicide Video: అనంతలో యువకుడి సెల్ఫీ వీడియో కలకలం.. పోలీసులే కారణమంటూ.. - అనంతపురం జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Youth Selfie Suicide attempt Video: తమను చంపేందుకు ఎదురింటివారు వస్తున్నారని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా.. తిరిగి పోలీసులే తనపై కేసులు నమోదు చేసి.. తనను విచక్షణారహితంగా కొట్టి వేధిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఓ సెల్ఫీ వీడియో తీసి.. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెల గ్రామంలో జరిగింది.
సమాచారం ప్రకారం.. తరిమెల గ్రామానికి చెందిన రాజేష్‌కు.. తన ఎదురింటి వారితో గత పది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల రాజేష్ తన మామతో కలిసి బయటకు వెళ్తుండగా ఓ వ్యక్తి అక్కడికి వచ్చి వారిపై కర్రలతో దాడి చేశాడు. రాజేష్ అక్కడి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు వారిపై చర్యలు తీసుకోకుండా తిరిగి తనపైనే రేప్ కేసు పెట్టి.. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారంటూ ఆ యువకుడు ఆరోపించాడు. పోలీసులు తనకు న్యాయం చేయకుండా అవతల వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశాడు.
తాను ఆత్మహత్య చేసుకోవటానికి కారణం తన ఎదురింటివారు, పోలీసులేనని వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రాజేష్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన కొన్ని గొడవల కారణంగానే రాజేష్‌ను చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.