సమస్యలపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్నారు - అందుకే వైసీపీకి రాజీనామా! - వైసీపీ వర్సెస్ మహమ్మద్ సాదిక్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2023, 3:43 PM IST
YCP corporator Mohammad Sadiq resigns: విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 39వ వార్డు కార్పొరేటర్, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) సభ్యుడు మహమ్మద్ సాదిక్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి గల కారణాలను మీడియాకు ఆయన వివరించారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహార శైలితో, తనతో పాటుగా మరి కొందరు వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సాదిక్ ఆరోపించారు. ఎమ్మెల్యేపై పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డికి తెలియజేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాలని జీవీఎంసీకి లేఖలు ఇస్తే, ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని సాదిక్ ఆరోపించారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో అవినీతిపేరుకు పోయిందని మహమ్మద్ సాదిక్ ఆరోపించారు. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచానని, వైసీపీలో చేరిన దగ్గరినుంచి, ఎమ్మెల్యే తీరుతో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. స్థానిక సమస్యలపై మాట్లాడితే టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని సాదిక్ వెల్లడించారు. తనలాగే మరి కొందరు కార్పొరేటర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలిపారు. తనకు సపోర్టు చేసిన కార్యకర్తలతో త్వరలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటానని సాదిక్ పేర్కొన్నారు.