ఉద్యోగులకు జీతాలివ్వని కాంట్రాక్టర్ - 300 గ్రామాలకు నిలిచిన నీటి సరఫరా - తాగు నీటి పథకం కథనం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 7:44 PM IST
Water Supply Stop to villages with SRP workers Strike: అనంతపురం జిల్లా శ్రీరామ్ రెడ్డి తాగు నీటి పథకం ఉద్యోగులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వందలాది గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గంలోని సుమారు 300 గ్రామాలకు పైగా ఈ శ్రీరామ్ రెడ్డి తాగు నీటి పథకం ద్వారా మంచినీరు అందిస్తున్నారు. అయితే, గత నాలుగు సంవత్సరాలుగా తాగునీటి పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన జీతాలను కాంట్రాక్టర్ సకాలంలో చెల్లించడం లేదు. జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతూ వస్తోంది. జీతాల కోసం ఉద్యోగులు ఆందోళనలు చేపట్టినప్పుడు మాత్రమే కొంత మొత్తాన్ని చెల్లించి సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నారు.
తాజాగా, గత ఐదు నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే జీతాల కోసం ఉద్యోగులు నాలుగు రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా, నేడు పంప్‌హౌస్ వద్దకు చేరుకున్న ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అనంతరం పంప్‌హౌస్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. తమకు రావాల్సిన బకాయిలన్నీ ప్రభుత్వం సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాధికారులు తమ సమస్యలపై స్పందిచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.